గ్రేటర్‌లో ఎక్కడ చూసినా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి : కేటీఆర్ ఆగ్రహం

హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా..రోడ్డుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు

KTR
X

గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడ చూసిన చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయన్నారు. డెంగీ, మలేరియా, అతిసారం వంటి సీజనల్ వ్యాధులతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. నగరాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2024లో హైదరాబాద్‌ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలుపుతామన్న లక్ష్యం నీరుగారుతోందన్నారు. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్బేజ్‌ వల్నరబుల్‌ పాయింట్స్‌) జీహెచ్‌ఎంసీ పరిధిలో 2640 ప్రాంతాలను గుర్తించి, వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

కానీ క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ఈ నేపథ్యంలోనే పారిశుధ్యంపై ఫిర్యాదులు అధికం కావడం, ఇటీవల హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వయంగా మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి పారిశుధ్య నిర్వహణ ఏ మాత్రం బాగులేదని, తన డివిజన్‌లో చెత్త ఎత్తడం లేదని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. చెత్త తరలింపు కేవలం కాగితాల్లో మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. మేయర్‌, అధికారుల ఆకస్మిక పర్యటనలు లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోందన్నారు. పర్యవేక్షించాల్సిన పార్ట్ టైం మున్సిపల్ మంత్రి... ఎమ్మెల్యేల కొనుగోళ్లు, ఢిల్లీ చక్కర్లలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పౌరుల ఆరోగ్యాలు కాపాడాలని కేటీఆర్ సూచించారు.

ఒకొక ఆటోకు కాలనీల వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే ఒకొక అటోకు సుమారుగా 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండటం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్‌ ఉండటం లేదు. రోజూ 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని.. స్వయంగా గత కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ గుర్తించారు. నేటికీ స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోతున్నది. సమయ పాలన పట్టించుకోకపోవడం, చెత్త సేకరణలో అధిక వసూళ్లకు తెరలేపడం, సిటీలో ఉండాల్సిన స్వచ్ఛ ఆటోలు గ్రేటర్‌ సరిహద్దులు దాటుతుండటం గమనార్హం. ఇదే విషయంపై ఇటీవల కొత్త కమిషనర్‌ ఆమ్రపాలి సైతం స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగుపర్చాలని, లేదంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Vamshi

Vamshi

Writer
    Next Story