ఫలించని కాంగ్రెస్‌ విందు రాజకీయాలు

రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి పార్టీ మారితే రాజకీయంగా దారుణంగా దెబ్బతిన్నామనే కొందరు ఎమ్మెల్యేలు నిన్న పోచారం నివాసంలో ఇచ్చిన విందులో బాహాటంగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం.

ఫలించని కాంగ్రెస్‌ విందు రాజకీయాలు
X

శాసనసభలో సీఎం వ్యవహారశైలి వివాదాస్పదమౌతున్న వేళ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల్లో అంతర్మథనం మొదలైంది. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్‌తో అసెంబ్లీలో భేటీ అయ్యారు. బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారు. నిన్న మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో విందుకు కూడా ఆయన దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో కలవరం మొదలైంది. . ఆయనను మంత్రి బుజ్జగించి కాంగ్రెస్‌లో కొనసాగేలా ఒప్పించాలని రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు కృష్ణమోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.

పార్టీ మారితే ప్రాధాన్యం ఇస్తామని, మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని సీఎం ఒక్కొక్కరికి ఒక్కో విధమైన హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనమౌతుందని, అనర్హత వేటు పడే అవకాశం లేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పిన మాటలు అసత్యాలని తేలింది. పార్టీ మారినా ఫలితం లేకపోగా..రెంటికి చెడ్డ రేవడిలా ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది. ఒకవైపు పార్టీ మారినందుకు ప్రజల నుంచి వ్యతిరేకత.. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నేతల నుంచి నిరసనలతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి నెలకొన్నది. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి పార్టీ మారితే రాజకీయంగా దారుణంగా దెబ్బతిన్నామనే కొందరు ఎమ్మెల్యేలు నిన్న పోచారం నివాసంలో ఇచ్చిన విందులో బాహాటంగానే వ్యాఖ్యానించినట్టు సమాచారం.

అలా ఏమీ ఉండదని, అందరికి సముచిత స్థానం కల్పిస్తామని సీఎంతో పాటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌ మున్షీ హామీ ఇచ్చినా కొందరు ఎమ్మెల్యేలు వారి మాటలు విశ్వసించలేదని తెలిసింది. పార్టీ మారినందుకు పోచారం లాంటి వాళ్లకే కేబినెట్‌లో చోటు దక్కుతుంది తప్పా మాకు ఎలాంటి ప్రయోజనం ఉండదనే అభిప్రాయం మెజారిటీ ఎమ్మెల్యేల్లో వ్యక్తమౌతున్నదట. అలాగే ఎనిమిది నెలల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్తున్నదని, అన్నివర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొన్నదని ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి కోరి కష్టాలు తెచ్చుకోవడం కంటే ఘర్‌ వాపసీకే మెజారిటీ ఎమ్మెల్యేలు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం.

Raju

Raju

Writer
    Next Story