CM అంటే కటింగ్‌ మాస్టరా?: కేటీఆర్‌

కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో 'అందరికీ అన్నీ' అన్నారని.. అధికారంలోకి రాగానే ' కొందరికే కొన్ని' అంటూ కోత పెడుతున్నారని కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఎద్దేవా చేశారు.

CM అంటే కటింగ్‌ మాస్టరా?: కేటీఆర్‌
X

సీఎం అంటే కటింగ్‌ మాస్టరా? అని రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టడమే లక్ష్యమా? సీఎం అనే పదానికి ఇదే సరికొత్త నిర్వచనమా? అంటూ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. నాడు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్‌ తెచ్చుకోమన్నారని... నేడు రూ. 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 39 వేల కోట్లు.. ఇప్పుడు రూ. 31 వేల కోట్లకు కటింగ్‌ పెట్టి కుదించారన్నారు. పాస్‌బుక్కులు లేవనే నెపంతో లక్షల మందికి శఠగోపం పెట్టే కుటిల ప్రయత్నం చేస్తే సహించబోమన్నారు. రేషన్‌కార్డు సాకు చూపి లక్షల మందికి మొండి చెయ్యి ఇచ్చే కుతంత్రం చేస్తే భరించమన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో 'అందరికీ అన్నీ' అన్నారని.. అధికారంలోకి రాగానే ' కొందరికే కొన్ని' అంటూ కోత పెడుతున్నారని ఎద్దేవా చేశారు.





ఆదాయయ పన్ను చెల్లిస్తున్నారని కొంతమందికి, చిన్నపాటి ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్నారని ఇంకొంతమందికి పథకాలలో శూన్య హస్తం చూపే చీకటి పన్నాగాన్ని చూస్తూ ఊరుకునేది లేదన్నారు. మొన్న లక్షలాది మందిని రూ. 500 సిలిండర్‌ పథకానికి దూరం చేశారని.. నిన్న 200 యూనిట్ల పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారంటూ మండిపడ్డారు. నేడు రూ. 2 లక్షల రుణమాఫీని కూడా ఎగొట్టేందుకు లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదన్నారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధుకు ఇప్పటికీ దిక్కులేదని.. ఓట్ల పండుగ ముగిసినా ఎకరానికి రూ. 7500 రైతు భరోసా అడ్రస్సే లేదని విమర్శించారు. రుణమాఫీపై మాట తప్పినా.. మడమ తిప్పినా లక్షలాది మంది రైతు కుటుంబాల తరఫున ప్రశ్నిస్తాం.. పోరాటం చేస్తామంటూ కేటీఆర్‌ హెచ్చరించారు.

Raju

Raju

Writer
    Next Story