కొద్దిమందికే రైతు భరోసా ఇచ్చే కుట్ర !

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొద్దిమందికే రైతు భరోసా ఇచ్చే కుట్ర చేస్తున్నదని, రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి అని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, దయాకర్‌రావులు మండిపడ్డారు.

కొద్దిమందికే రైతు భరోసా ఇచ్చే కుట్ర !
X

రైతాంగం గొంతు కోయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని అన్నట్టుగా ఉన్నదని, ఎన్నికల ముందు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ,ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్‌లో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆకలి అవుతుతున్నదంటే ఆరు నెలలు ఆగండి అన్నట్టు ఈ ప్రభుత్వ తీరు ఉన్నది. రైతాంగాన్ని నట్టేట ముంచే పని చేస్తున్నారు. రైతు బంధు ఇప్పటికే పడాల్సిందన్నారు. రేవంత్ ప్రభుత్వం వచ్చి మూడు సీజన్లు అవుతున్నదని, రైతు భరోసా కాదు కదా రైతు బంధు కూడా సరిగా ఇవ్వడం లేదని విమర్శించారు. తాజాగా రైతు భరోసా పై మంత్రి వర్గ ఉపసంఘం వేసి జూలై 15 దాకా డెడ్ లైన్ పెట్టారు. అప్పటికే నాట్లు వేసే పని పూర్తవుతుంది ..సీజన్ అయిపోయాక రైతు భరోసా ఇస్తారా? రైతు భరోసా కు అర్హులెవరో ఇప్పటి దాకా ఎందుకు తేల్చలేదు ? అని ప్రశ్నించారు.

రైతు భరోసా కు మంత్రి వర్గ ఉపసంఘం వేయడం కుంటి సాకు మాత్రమే

కేసీఆర్ హయంలో రైతు బంధు కింద 68 లక్షల 90 వేల మందికి ఒక కోటి 52 లక్షల ఎకరాలకు 11 విడతల్లో 72 వేల కోట్లు రూపాయలు ఇచ్చాం. రాష్ట్రంలో 2 వేల 603 క్లస్టర్ లు ఉన్నాయి. ప్రతి క్లస్టర్ లో 5 వేల ఎకరాలు ఉంటాయి.డాటా అంతా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నదన్నారు. రైతు భరోసా కు మంత్రి వర్గ ఉపసంఘం వేయడం కుంటి సాకు మాత్రమేనని, ఈ ఆధునిక యుగంలో లబ్ధిదారులను ఎంపిక చేయడం ఓ గంట పని అన్నారు. ఎక్కడైనా ఒక్కటో ఆరో పొరపాట్లు జరిగితే సవరించుకోవడం పెద్ద పని కాదు. మంత్రి వర్గ ఉపసంఘం పేరుతో కొద్దిమందికే రైతు భరోసా ఇచ్చే కుట్రకు తెర లేపారు మండిపడ్డారు. రైతు భరోసా కు పట్టాదార్ పాస్ పుస్తకాలే ప్రామాణికం కావాలి. రెవెన్యు రికార్డులు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి ..వాటి ప్రకారం ఇవ్వాలి .రైతు బంధు గుట్టలున్న చోట ఇచ్చారని దుర్మార్గంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయంలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి వెచ్చించాం కేసీఆర్ తీసుకున్న చర్యలతో రైతాంగం బాగుపడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందన్నారు. సాకులు చెప్పి రైతులకు సాయాన్ని ఎగ్గొట్టే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపుతున్నది.

తెలంగాణ లో ప్రతి ఇంచి భూమి సాగుకు అనువైనదే

25 ఎకరాలకు పై బడి ఉన్న రైతులు 6 వేల 500 మందికి మించి లేరు.ఒక్క ఎకరా కూడా పడావు గా ఉండకూడదనే తపనతో కేసీఆర్ ఆనాడు కేసీఆర్ రైతు బంధు ప్రవేశపెట్టారు. తెలంగాణ లో ప్రతి ఇంచి భూమి సాగుకు అనువైనదే. అపుడు ఏడాది లో మూడు పంటలకు రైతు బందు ఇవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి అన్నారు ..ఇపుడు ఒక్కసారి కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. సీఎం నియోజకవర్గం కొడంగల్ లోనూ నకిలీ విత్తనాల దందా వెలుగులోకి వచ్చింది. కాలయాపన చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని గా మారింది. అలాగే కేసీఆర్ హయం లో రుణ మాఫీ కాకుండా మిగిలింది నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిపారు.

2 లక్షల రూపాయల పంట రుణాలు ఎంత మందికి ఉన్నాయి?

రాష్ట్రం లో ఐదెకరాల భూమి ఉన్న రైతుల సంఖ్య 92 శాతం. ఐదెకరాల లోపు ఉన్న రైతుకు లక్ష రూపాయలకు మించి పంట రుణం ఏ బ్యాంకు ఇవ్వదు. 2 లక్షల రూపాయల పంట రుణాలు ఎంత మందికి ఉన్నాయో వివరాలు రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీ జరిగినట్టే కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. డిసెంబర్ 9 న రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇపుడు కాబినెట్ లో చర్చిస్తారా ?అని ప్రశ్నించారు. కేసీఆర్ ను గుడ్డిగా వ్యతిరేకించడమే కొందరి పనిగా మారిందని వారి హయం లో జరిగిన మంచి ని మంచిగా చెప్పడం కొందరికి నచ్చడం లేదన్నారు.

రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి: ఎర్రబెల్లి

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కేసీఆర్ పాలన లో రైతులు సంతోషంగా ఉన్నారు. ఇపుడు రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో ఓ సారి రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాలని సూచించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఫైర్‌ అయ్యారు. రేవంత్‌ పాలనలో అన్ని విషయాల్లో రైతుల పరిస్థితి ఘోరంగా మారింది అన్నారు. రైతులకు సాయం అనే సరికి కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు ,షరతులు పెడుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కేసీఆర్ హాయంలో రైతు కు చిన్న ఇబ్బంది కలుగలేదని, పాత కాంగ్రెస్ ప్రభుత్వ రోజులు మళ్ళీ వచ్చాయన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల సమస్యల పై ధర్నాలు చేశారు ..అలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవద్దని హితవు పలికారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదని,కేసీఆర్ ను మళ్ళీ సీఎం ను చేయడమే నా లక్ష్యం అన్నారు.

Raju

Raju

Writer
    Next Story