రుణమాఫీపై కాంగ్రెస్‌ వర్సెస్ బీఆర్‌ఎస్‌

హరీశ్‌, సీఎం రేవంత్‌ల రాజీనామాపై పోటా పోటీగా పోస్టర్లు, హోర్డింగ్స్

రుణమాఫీపై కాంగ్రెస్‌ వర్సెస్ బీఆర్‌ఎస్‌
X

రుణమాఫీపై అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి కండీషన్లు లేకుండా అందరికీ రుణమాఫీ చేయాలని ప్రధాన ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నది. హరీశ్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌.. రుణమాఫీ మాట నిలుపుకోవడంలో విఫలమైన సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చెయ్యాలని హైదరాబాద్ లో అర్ధరాత్రి వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్స్. ఈ విషయం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మూడు విడతల్లో చేసి.. దానికి మూడు సార్లు పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేసుకున్నారు. కానీ మొత్తం రుణమాఫీకి రూ. 31 వేల కోట్లు అవసరమౌతాయన్న రేవంత్‌ సర్కార్‌ మూడు విడతల్లో రూ. 17,934 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేసి చేతులు దులుపుకున్నది. మొదటి రెండు విడతల్లో రుణమాఫీ కాని రైతులు జిల్లా అధికారుల, బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సాంకేతిక సమస్యలతో కొంతమందికి రుణమాఫీ కాలేదన్న రేవంత్‌ దానిని ఇప్పటికీ సరిచేయలేదు. పైగా మొత్తం రుణమాఫీ చేశామంటూ కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాలకు పిలుపునిచ్చింది. రుణమాఫీ కాని రైతుల నుంచి లక్షల సంఖ్యలో తమకు ఫిర్యాదు వస్తున్నాయని ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్సే కాదు, బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. కానీ కాంగ్రెస్‌ మాత్రం బీఆర్‌ఎస్‌ను, ముఖ్యంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులను టార్గెట్‌ చేసింది. రుణమాఫీ చేశామనని రాజకీయంగా మైలేజ్‌ కొట్టేదామనుకుంటే అధికారిక లెక్కలతో తమను ఇబ్బందిపెడుతున్నదని సీఎం బూతులు మొదలుపెట్టారు.





రుణమాఫీ చేశామని హరీశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయగానే కాంగ్రెస్‌ శ్రేణులతో నగరంలో హోర్డింగ్స్‌ పెట్టించారు. '2 లక్షల రుణమాఫీ.. అన్నదాతల రుణ విముక్తి పండుగ.. రైతన్నల ముఖాల్లో చిరునవ్వులు నిండగా.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంతన్న సర్కార్‌' అంటూ ఒకవైపు 'దమ్ముంటే రాజీనామాచెయ్‌.. రుణమాఫీ అయిపోయే.. నీ రాజీనామాఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్‌ రావు..' అంటూ మైనంపల్లి అభిమానుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఇది ఎవరు పెట్టించారో ప్రత్యేక చెప్పనక్కరలేదు. తనకు, తన కొడుక్కు టికెట్‌ కావాలని కోరడంతో కేసీఆర్‌ నిరాకరించాడు. దీంతో మైనంపల్లి హనుమంతరావు ఆయన తనయుడితో కలిసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నాడు. హరీశ్‌, కేటీఆర్‌లను సవాల్‌ చేసిన మైనంపల్లి మెదక్‌లో కొడుకును గెలిపించుకున్నా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో ఓడిపోయాడు. దీంతో సీఎం రేవంత్‌ను ప్రసన్నం చేసుకుని ఏదో పదవి దక్కించుకోవాలని హరీశ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టించినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.

మరోవైపు 'రుణమాఫీ మాట తప్పి మోసం.. రైతాంగం పాలిట కాంగ్రెస్‌ శాపం' అంటూ బీఆర్‌ఎస్‌ అభిమానుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. రుణమాఫీ ద్రోహం.. రైతుల పాలిట కాంగ్రెస్ శాపమని, 31 వేల కోట్లు చెప్పి 17 వేల కోట్ల మాపీతో సరిపెట్టారని సీఎంపై విమర్శల వెల్లువెత్తుతున్నాయి.

నగరంలో అధికార , ప్రధాన ప్రతిపక్షం అభిమానుల పేరుతో అకస్మాత్తుగా వెలిసిన పోస్టర్లు, హార్డింగ్స్ ను నగర వాసులు ఆసక్తిగా చూస్తున్నారు. వీటిని కొందరు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story