కాంగ్రెస్‌లో ఫిరాయింపుల కలవరం

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు బీఆర్‌ఎస్‌ ఇప్పటికే పిటిషన్లు అందించింది. స్పీకర్‌ ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ ఆలోచిస్తున్నది.

కాంగ్రెస్‌లో ఫిరాయింపుల కలవరం
X

ఈ నెల 24 నుంచి రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేవంత్‌ సర్కార్‌ పాలన పట్టించుకోకుండా ఫిరాయింపులపై ఫోకస్‌ పెట్టింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను 10 మందిని చేరుకున్నది. బడ్జెట్‌ సమావేశాలకు ముందే బీఆర్‌ఎస్‌ ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలనే రేవంత్‌ ప్రయత్నాలు ఫలించేలా కనిపించడం లేదు. సంఖ్యా పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌కు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటివరకు 10 మంది పార్టీ వీడగా.. ఆ పార్టీ చెబుతున్నట్టు విలీనం కావాలంటే మరో 16 మంది కావాలి. అది అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో బడ్జెట్‌ సమావేశాలు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయి. ఎందుకంటే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేశారు. పార్టీ విలీనం కానంతవరకు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాంకేతికంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతినిధులుగానే కొనసాగనున్నారు.

దీంతో రేపు సభలో పద్దులపై లేదా ఏదైనా అంశంపై మాట్లాడాలంటే వారిని కాంగ్రెస్‌ సభ్యులుగా, వారి పార్టీ సభ్యులుగా చూడటానికి వీల్లేదు. దీంతో రేవంత్‌రెడ్డి అనాలోచిత చర్యలు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిని తెచ్చిపెట్టాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉండటంతో ఆ గడువు సమీపిస్తున్నది. దానం నాగేందర్‌పై ఇచ్చిన పిటిషన్‌ గడువు దాటింది. దీంతో ఒకవేళ స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తే సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తున్నది. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంలో జోక్యం చేసుకుని వారంలో చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే అప్పుడు స్పీకర్‌ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక జరిగే అవకాశాలూ లేకపోలేదు. ఏడు నెలల పాలనలో అస్తవ్యవస్థ నిర్ణయాలతో రైతులు, నిరుద్యోగులు, మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుండటం కాంగ్రెస్‌ పార్టీని కలవరానికి గురిచేస్తున్నది. పార్టీ ఫిరాయించిన ఒకరిద్దరిని మంత్రివర్గంలోకి కొంతమందిని తీసుకోవాలని అనుకున్నా అనర్హత వేటు పడొచ్చు అన్న ఆలోచనతోనే ఆ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసిందని, కాంగ్రెస్‌ టికెట్‌పైన గెలిచిన వారినే కేబినెట్‌లోకి తీసుకుంటామని రేవంత్‌తో చెప్పించింది అంటున్నారు.

మరోవైపు ఫిరాయింపులపై దూకుడుగా వెళ్లాలని బీఆర్‌ఎస్‌ భావిస్తున్నది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు, 6 గురు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద వీరిపై అనర్హత వేటు వేయించేందుకు గట్టిగా యత్నించాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయిచింది. ఫిరాయింపులపై స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌కు అనర్హత పిటిషన్‌ ఇచ్చింది. మార్చి 18న దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్‌ను ఇచ్చారు. ఆ తర్వాత స్పీకర్‌ సమయం ఇవ్వకపోవడంతో మెయిల్‌, వాట్సప్‌, స్పీడ్‌ పోస్టు ద్వారా స్పీకర్‌ కార్యాలయానికి పంపారు. స్పీకర్‌ పిటిషన్లు తీసుకోవడం లేదని హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా 9 మందిపై అనర్హత వేటు వేయాలని సభాపతి పిటిషన్లు అందించారు.

ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉన్నది. అయితే రాజకీయ కారణాలతో వేటు వేయకుండా ఆలస్యం చేయడానికి వీల్లేదని బీఆర్‌ఎస్‌ చెబుతున్నది. దీనికోసం ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నదని మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ వారిపై చర్యలు తీసుకోవడానికి స్పీకర్‌ ఆలస్యం చేస్తే మణపూర్‌లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీం సూచించిన మూడు నెలల్లో అనర్హత వేటు వేయకపోవడంతో వారంలో రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అప్పుడు ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. స్పీకర్‌ గౌరవాన్ని, శాసనసభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్‌ను కోరింది. స్పీకర్‌ కూడా తాను పరిశీలించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

మణిపూర్‌, తమిళనాడు మహారాష్ట్రలో ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను బీఆర్‌ఎస్‌ ప్రధానంగా ప్రస్తావిస్తున్నది. పిటిషన్‌ దాఖలు చేసిన మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాల్సిందే గులాబీ పార్టీ అంటున్నది. రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పును సమర్థించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌, హరీశ్‌రావు ఈ అంశంపై దృష్టి సారించారని సమాచారం. మణిపూర్‌, తమిళనాడు మహారాష్ట్రలలో పార్టీ ఫిరాయింపులపై కేసులు వాదించిన న్యాయవాదులలో చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తున్నది. గతంలో ఫిరాయింపులపై కేసులు వాదించిన సుందరం బీఆర్‌ఎస్‌ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. హైకోర్టు తీర్పును అనుసరించి, స్పీకర్‌ కూడా ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ చూస్తున్నది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.

Raju

Raju

Writer
    Next Story