కాంగ్రెస్‌ హామీలంటే కండీషన్స్‌ అప్లై

ఎనిమిది నెలల్లో రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పాలన చూసిన ప్రజలకు 'ప్రజలను మా చేతిలో మోస పోవాలని కోరుకుంటున్నారని అప్పుడెప్పుడో అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలు' తిరిగి గుర్తుకు తెచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు.

కాంగ్రెస్‌ హామీలంటే కండీషన్స్‌ అప్లై
X

కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది. ధరణిని బంగాళా ఖాతంలో కలిపేస్తాం. నిరుద్యోగులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టండి. బీఆర్‌ఎస్‌ గడీల పాలనను బద్దలు కొడుతాం. ఇవన్నీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అండ్‌ కాంగ్రెస్‌ నేతలు చేసిన దుష్ప్రచారాలు. నిజం నిద్ర లేచేలోగా అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందనేది నానుడి. ఎనిమిది నెలల పాలనలో ఇవన్నీప్రజల అనుభవంలోకి వచ్చాయి. ప్రమాణ స్వీకారం రోజు బిల్డప్‌ కోసం ప్రగతి భవన్‌ ముందు బద్దలు కొట్టిన ఇనుప కంచెలే ఇప్పుడు టీజీపీఎస్సీ, అసెంబ్లీ, ముఖ్యమంత్రి ఇంటి ముందు, సచివాలయం ముందు ఒక్కచోట ఏమిటి అన్నిచోట్లా అవే కనిపిస్తాయి. మొన్నటివరకు కేసీఆర్‌పై యూట్యూబ్‌, సోషల్‌ మీడియాలో ఒంటికాలిపై లేచిన వాళ్లకే గుంపుమేస్త్రీ (ముఖ్యమంత్రే అంటే గుంపు మేస్త్రి లెక్క అని అభివర్ణించారు) మార్క్‌ పాలన అంటే ఏమిటో రుచి చూపెట్టారు. ఆయన పెద్ద బ్లాక్‌మెయిలర్‌ అన్న వాళ్లే తమ రాజకీయ ప్రయోజనాల కోసం పొగుడుతున్నాచాలామందికి అవే గుర్తుకు వస్తున్నాయి. అబద్ధానికి, అర్ధసత్యాలకు, దుష్ప్రచారాలకు, ఆచరణ సాధ్యం కాని హామీలకు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ పర్యాయ పదంగా మారింది.

అధికారంలోకి వచ్చిన మొదట్లోనే సీఎం ప్రజలకు ఒక హింట్‌ ఇచ్చారు. ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చా.. కానీ ఏమీ లేదని వాపోయాడు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై విపక్షాలు, ప్రజల నుంచి ప్రశ్నలు మొదలుకాగానే అటెన్సన్‌ డైవర్సన్‌ పాలి'ట్రిక్స్' మొదలుపెట్టారు. అర్జెంటుగా బీఆర్‌ఎస్‌ వీక్‌ చేయాలి. కేసీఆర్‌ పేరు, పథకాలపై ప్రజల్లో చర్చ జరకుండా ఆ ఆనవాళ్లు లేకుండా చేసే కుట్రలు మొదలుపెట్టారు. అవీ విఫలం కావడంతో ఫిరాయింపులు ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల ఎన్నికల ఫలితాల నాటికి లేదా బడ్జెట్‌ సమావేశాలకు ముందే బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనం అవుతుందని కొన్ని మీడియా సంస్థల్లో, డిజిటల్‌, సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించారు. తన హిడెన్‌ అజెండా రాజకీయాలు అటు బాహ్య ప్రపంచానికి, ఇటు కాంగ్రెస్‌ పార్టీ వాళ్లకు ఎక్కడ బహిర్గతమౌతాయోనని ప్రజాభవన్‌ను, ప్రజా పాలన దరఖాస్తుల సమస్యలను డిప్యూటీ సీఎం చేతిలో పెట్టి.. క్యాంపు రాజకీయాలను తాన ఇంటికి మార్చాడు. ఎక్కే గడప.. దిగే గడప అన్నట్టు ఎంత చేసినా పది మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ కండువా కప్పగలిగాడు. వాళ్లలో రోజుకొకరు మాకు ఇచ్చిన హామీల సంగతి ఏమిటని నిలదీస్తుంటే కలవడం తగ్గించాడు. ఇక లాభం లేదని మెల్లగా ఒక్కక్కోరు నిరసన గళం విప్పుతుంటే విందు రాజకీయాలు మొదలుపెట్టి బుజ్జగింపులు ప్రారంభించాడు. అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాల్లో విపక్ష సభ్యుల నుంచి గట్టిగా ప్రశ్నలు ఎదురవుతుంటే సభను పక్కదోవ పట్టించడానికి రన్నింగ్‌ కామెంట్స్‌ చేయడం, లేదా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం లాంటి అస్త్రాలను ప్రయోగించారు. తాను సీఎం అన్న సంగతి ఇప్పటికీ రేవంత్‌ నమ్మలేకపోతున్నట్టే సభలో వ్యవహరిస్తున్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతారు. మాజీ మంత్రలు సబిత, సునితాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. బీఆర్‌ఎస్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గవర్నర్‌ రిసీవ్‌ చేసుకోవడానికి వెళ్తున్నానని మెల్లాగా జారుకున్నారు. సభలో బీఆర్‌ఎస్‌ సభ్యులు లేనప్పుడు మహిళా ఎమ్మెల్యేలపై తాను చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశంతో ముడిపెట్టి మాట్లాడుతారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అనేది ఒక బోగస్‌ అని వాళ్ల పార్టీ జాతీయ నాయకత్వం వాదన. కేజ్రీవాల్‌ అరెస్టును ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఖండిస్తుంది. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి ఆపార్టీ పోటీ చేస్తుంది. అదే కేసులో కవిత ను అక్రమంగా అరెస్టు చేశారని బీఆర్‌ఎస్‌ అంటే దానికి విరుద్ధంగా సీఎం బీజేపీ నాయకుడిలా మాట్లాడుతారు. సీఎం వ్యవహారశైలి చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీకి అధికార ప్రతినిధిని నేనే అన్నట్లు మాట్లాడుతుంటారు మరి.

ఇవాళ సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై బూతులు మాట్లాడిన ఎమ్మెల్యేపై మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం మాట్లాడిన మాటలు మళ్లా ఒక్కసారి వినాలని అందరూ కోరుకుంటున్నారు. అలాంటి ఆ వ్యక్తి చేత నోటికొచ్చినట్లు మాట్లాడిస్తూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారు అని బీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేల విమర్శలు వాస్తవమే అనేలా అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తే అర్థమౌతుంది. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన అంటూ ఊదరగొట్టారు. ఎక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారోననిదీనిపై చర్చ లేదన్నారు. సభలో ప్రతిపక్షాన్ని బైటికి పంపి ప్రసంగాలు దంచుతున్నారు. అసెంబ్లీ లో తాను మాట్లాడుతుంటే బైటన నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్‌ వాళ్లకే ఎక్కడ మైలేజ్‌ వస్తుందోనని ఆందోళనలతో పోలీసులతో అరెస్ట్‌ చేయించారు. రేవంత్‌రెడ్డి రాజకీయాలతో కాంగ్రెస్‌పార్టీదే కాదు.. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చిందని తెలంగాణ ఉద్యమకారులు అంటున్నారు. ఆరు గ్యారెంటీలకు మంగళం పాడారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఉత్త బోగస్‌ అని ఇవాళ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటనతో చెప్పకనే చెప్పారు. రైతు భరోసా ఇవ్వకుండా రుణమాఫీ పై నిబంధనలతో రైతులను మోసం చేశారు. పత్రికల్లో పెద్ద పెద్ద ప్రకటనలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వని నోటిఫికేషన్లు, ప్రమోషన్లపై పెద్ద హోర్డింగులు పెట్టి తన వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎనిమిది నెలల్లో రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పాలన చూసిన ప్రజలకు 'ప్రజలను మా చేతిలో మోస పోవాలని కోరుకుంటున్నారని అప్పుడెప్పుడో అమెరికాలో తాను చేసిన వ్యాఖ్యలు' తిరిగి గుర్తుకు తెచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ హామీలంటే కండీషన్స్‌ అప్లై అనే చిన్న ట్యాగ్‌ లైన్‌ కూడా ఉంటుంది అనేది మరోసారి రుజువు చేశారు.

Raju

Raju

Writer
    Next Story