సభలో సీఎం నికృష్టంగా నోరు జారిండు

ఏ మనిషి కూడా మాట్లాడిన విధంగా మాట్లాడిండు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సభలో సీఎం నికృష్టంగా నోరు జారిండు
X

సీఎం రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో హీనాతి హీనంగా, నికృష్టంగా మహిళ సభ్యులనుద్దేశించి మాట్లాడారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియా పాయింట్‌ లో మాట్లాడారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలైన తమ ఆడబిడ్డలిద్దరినీ సీఎం, డిప్యూటీ సీఎం అవమానించడంపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం అకారణంగా ఏ మనిషి, ఏ నాయకుడు మాట్లాడని విధంగా జోరు జారాడని మండిపడ్డారు. మీ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్టాండ్ అని మాట్లాడిన మాటకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అవమానం ఒక్క సబితక్క, సునీతక్క, లక్ష్మమ్మకు మాత్రమే కాదు. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకే అవమానమన్నారు. మహిళలను, తల్లులను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నట్లుగా మాట్లాడటం హేయం అన్నారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌ అన్‌ ఫిట్‌ అని.. ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. ఆయన స్థాయికి తగని పదవిలో కూర్చున్నారన్నారు. సంస్కారం ఉన్నోళ్లు జోరు జారితే వెంటనే ఆ మాటను వెనక్కి తీసుకుంటారని, ఇంత అహంకారం, కండకావరంతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డికి ఆడబిడ్డల ఉసురు తాకుతుందని హెచ్చరించారు.

సభలో ఈ రోజు సీఎం రేవంత్‌ అవమానించిన వాళ్లు రాజకీయాల్లో ఎంతో కష్టపడి సక్సెస్‌ అయిన వారు అని గుర్తు చేశారు. ఆయనలాగా ఇష్టమొచ్చినట్లు విన్యాసాలు చేస్తూ రాజకీయాల్లోకి రాలేదని, స్వశక్తితో వాళ్ల కుటుంబాలకు ఉన్న ఆదరణతో రాజకీయాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అలాంటి మహిళలను పట్టుకొని నోటికి వచ్చినట్లు వాగడం సీఎంకు తగదన్నారు. ఇప్పటికైనా సిగ్గు, బుద్ది తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ''ముఖ్యమంత్రి ఇట్లా ఉంటే.. ఉప ముఖ్యమంత్రి ఏ మొఖం పెట్టుకొని వచ్చినవ్ అంటారు. ఏ మొఖం పెట్టుకొని నువ్వు వచ్చినవో మేము కూడా అదే విధంగా వచ్చాం. మా ఆడబిడ్డలకు పట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి ఉప ముఖ్యమంత్రి నీకు ఎంత గుండె ధైర్యం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడే అధికారం ఎవరిచ్చారు.. పదేళ్లు మేము అధికారంలో ఉన్నాం. ఎప్పుడైనా ఈ విధంగా మహిళలను అవమానించామా.. ఈ రోజు నేను సీఎం గారిని ఏకవాచనం మాట్లాడితే వెంటనే సరిచేసుకున్నా. అది కేసీఆర్ గారు మాకు నేర్పిన సంస్కారం. తెలంగాణ ఆడబిడ్డలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికే నువ్వు చేసిన మోసాలతో విసిగిపోయి ఉన్నారు.. ఇది తెలంగాణ ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానం. వాళ్ల ఉసురు నీకు కచ్చితంగా తగులుతది..'' అన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పకుంటే ఇంతకు ఇంత అనుభవిస్తావని హెచ్చరించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన డిప్యూటీ సీఎం ఇకనైనా సంయమనంగా వ్యహరించాలని, లేదంటే తాము ఊరుకోబోమని హెచ్చరించారు.

Next Story