జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం యూటర్న్‌

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి.. ఇప్పుడు లీగల్ ఇష్యూస్‌ అంటున్నడు

జాబ్‌ క్యాలెండర్‌పై సీఎం యూటర్న్‌
X

కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగులను రెచ్చగొట్టిన మాట మరిచిండు.. పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీని వెంటబెట్టుకొని చిక్కడపల్లి సెంట్రల్‌ లైబ్రరీకి పోయి వాళ్లల్లో నిప్పు ఎగదోసిన ముచ్చట యాదికే లేనట్టు మాట్లాడిండు.. కొన్ని పార్టీలు, స్వార్థపూరిత శక్తుల చేతిలో పావులు కావొద్దని యువతకు నీతిబోధలు వళ్లిస్తున్నడు.. ఆయన ఇంకెవ్వలో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. నిరుద్యోగులంతా సర్కారుపైకి దండయాత్ర మొదలు పెడితే వాళ్ల పాదచప్పుళ్ల ప్రకంపనల కింద తన కుర్చీ ఎక్కడ కదిలిపోతుందోనన్న భయంతో నిన్న నిరుద్యోగుల ఆందోళనపై మొదటిసారిగా గొంతువిప్పిండు. ఎన్నికలకు ముందు ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ పై యూటర్న్‌ తీసుకున్నడు. గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల పెంపునకు లీగల్‌ ఇష్యూస్‌ అడ్డంకిగా ఉన్నాయని.. పోస్టులు పెంచితే మొత్తం నోటిఫికేషన్‌లే రద్దు అయిపోతాయని నిరుద్యోగుల్లో భయాందోళనలు పెంచేలా మాట్లాడిండు. అదే నిజమైతే మరి కాంగ్రెస్‌ జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాలు పెంచుతమని ఎందుకు హామీ ఇచ్చిండ్రు.. డీఎస్సీ పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చినట్టే.. గ్రూప్‌ -2, గ్రూప్‌ -3 సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ కు చాన్స్‌ ఉన్నా న్యాయవివాదాల పాట ఎందుకు ఎత్తుకున్నడు. నిరుద్యోగులు స్వార్థ పూరిత శక్తుల వలలో పడితే మొత్తం ఉద్యోగాల భర్తీకే బ్రేక్‌ పడుతుందని ఎందుకు చెప్తున్నడు.. అంటే తానే కొత్త వివాదాలు సృష్టించి ఈ పోస్టుల భర్తీని అడ్డుకునే ప్రయత్నమేదైనా చెస్తున్నడా?!

కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కొంతకాలంగా నిరసన బాట పట్టారు. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో ఇందిరాపార్క్‌ వద్ద నిరసన చేపట్టిన నిరుద్యోగులు నిన్న నిరుద్యోగ జేఏసీ పిలుపు మేరకు సర్వీస్‌ కమిషన్‌ను ముట్టడించారు. ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వం నిరుద్యోగులు, ఆందోళనకారుల పేరుతో రోడ్లపై వెళ్తున్నవారినీ వదిలిపెట్టకుండా స్టేషన్‌కు తరలించడంపై విమర్శలు వచ్చాయి. నిరుద్యోగులకు నాడు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయాలని కోరితే పట్టించుకోవడం లేదు. నిరసన తెలిపితే నిర్బంధం విధిస్తున్నారు. ఆందోళన చేస్తే అణిచి వేస్తున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నరో కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో అందరికీ అర్థమైంది.

నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి తన నివాసంలో అర్జెంటుగా మీటింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, ప్రొఫెసర్‌ రియాజ్‌, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్‌రెడ్డి, ఓయూ విద్యార్థి నేతలు మానవతారాయ్‌, బాల లక్ష్మి, చారకొండ వెంకటేశ్‌, కాల్వ సుజాత తదిరులతో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. నిరుద్యోగుల డిమాండ్లు, నిరసనలపై సీఎం ఆరా తీశారు. రానున్న రోజుల్లో పరిస్థితి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నదని విద్యార్థి సంఘం నేతలు చెప్పడంతో నిరుద్యోగుల డిమాండ్లపై సాధ్యాసాధ్యాలను చర్చించడానికి సీఎస్‌ శాంతికుమారితో పాటు సంబంధిత ఉన్నతాధికారులు పిలిచారు.

ప్రధానంగా నిరుద్యోగులు లేవనెత్తుతున్న గ్రూప్‌-1 మెయిన్ష్‌ 1:100 చొప్పున ఎంపిక, గ్రూప్‌-2, 3 పోస్టుల పెంపు, 25 వేల మెగా డీఎస్సీపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం. గ్రూప్‌-1కు సంబంధించి సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటికే పేర్కొన్న 1:50 పద్ధతినే సీఎం ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పారు. 1:100 చొప్పున అవకాశం కల్పిస్తే దీనికి వ్యతిరేకంగా ఎవరైనా కోర్టు వెళ్తే 5 నిమిషాల్లోనే కొట్టివేస్తుందని సీఎం చెప్పారు. నోటిఫికేషన్‌లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక జరుగుతుందని పేర్కొన్నామని, ఇప్పుడు 100 మందిని ఎంపిక చేసేలా నిబంధనలు సవరిస్తే కోర్టులు జోక్యం చేసుకునే ప్రమాదం ఉన్నదన్ని అధికారులు చెప్పినట్టు సీఎంవో లీకులు వదిలింది. సీఎం వ్యవహారం ఎలా ఉన్నది అంటే తాను ఒక నిర్ణయం తీసుకుని దాన్నే అమలు చేయాలి అన్నట్టు ఉన్నది. దీనిపై సర్వీస్‌ కమిషన్‌ స్పష్టత ఇచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలపై చర్చించడం అంటే కంటితుడుపు చర్యలే అని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. సాంకేతిక సమస్యలు వస్తాయని అన్నవాళ్లు ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చారు? తేదీలతో సహా పరీక్షలు పెడుతామని ఎందుకు చెప్పారు? అంటే అధికారం కోసం అప్పటికప్పుడు నిరుద్యోగులను ఏమార్చడానికి ఉత్తుత్తి ప్రకటనలు చేశారని ప్రభుత్వ వైఖరితో తేలిపోతున్నదని అని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటప్పుడు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రక్రియను పూర్తి చేసి మేము ఇచ్చిన హామీల ప్రకారం కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పాల్సింది అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలో కొత్తగా ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. గ్రూప్‌-1లో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌కు అదనంగా 60 పోస్టులు, గత ప్రభుత్వం 5089 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చింది తప్పా 25వేలతో మెగా డీఎస్సీ అన్న ముచ్చట ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

గ్రూప్‌-2,3 పోస్టుల పెంపుపై సీఎం అధికారులతో చర్చించినట్టు తెలుస్తోంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచడం వల్ల టెక్నికల్‌ సమస్యలు వస్తాయని, అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారట. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వలేదా? ప్రస్తుతం గ్రూప్‌-2, 3 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి అప్పుడే పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. సాంకేతిక సమస్యల సాకుతో ప్రభుత్వం సమస్యను దాటవేసే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు పరీక్షకు ప్రిపరేషన్‌ కోసం రెండు నెలల సమయం ఇవ్వాలన్నదానిపై కూడా భేటీలో చర్చించినా దీనిపై స్పష్టత లేదు. పరీక్షల తేదీల విషయంలో సంబంధిత నియామకబోర్డులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామనడం నిరుద్యోగుల మరోసారి మోసం చేయడానికే అన్నది వాళ్లు ఆరోపిస్తున్నారు. ఒకవైపు షెడ్యూల్‌ ప్రకటించి, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసుకుంటూ త్వరలో నిర్ణయం ప్రకటిస్తామని, ఆ తర్వాత న్యాయ పరమైన చిక్కులు వస్తాయని చెప్పి తప్పించుకోవడానికే ప్రభుత్వం యత్నిస్తున్నదని నిరుద్యోగులు ధ్వజమెత్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story