రేవంత్‌ తో పాటు ఉత్తమ్‌ నోటిని ప్రక్షాళన చెయ్యాలే

బూతులు మాట్లాడటంలో సీఎం కన్నా తానేమి తక్కువ కాదని చెప్పదల్చుకున్నాడా : మాజీ మంత్రి హరీశ్‌ రావు

రేవంత్‌ తో పాటు ఉత్తమ్‌ నోటిని ప్రక్షాళన చెయ్యాలే
X

సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నోటిని కూడా ప్రక్షాళన చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఉత్తమ్‌ వ్యాఖ్యలకు శనివారం ఆయన ఒక ప్రకటనలో కౌంటర్‌ ఇచ్చారు. బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం సీఎం రేవంత్ కు తానేమి వెనుకబడలేదని నిరూపించాలనుకున్నావా అని ఉత్తమ్‌ ను ప్రశ్నించారు. పేరేమో ఉత్తమ్.. మాటల తీరేమో మూసీ ప్రవాహంలా ఉందన్నారు. జలయజ్ఞంలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్దతిని ప్రవేశపెట్టి ఇష్టమున్నట్టు ప్రాజెక్టుల అంచనాలు పెంచేసింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. ఏజెన్సీలకు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ లు ఇచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టింది.. సర్వే, డిజైన్‌ అడ్వాన్స్‌ లను 0.5 శాతం నుంచి 3.5 శాతానికి పెంచుకునే వెసులుబాటు కల్పించి రాష్ట్రాన్ని డెకాయిటీ చేసింది మీ పార్టీ కాదా అని నిలదీశారు.

ప్రాణహిత - చేవెళ్ళ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.17 వేల కోట్ల నుంచి తట్ట మట్టి ఎత్తకుండానే రూ.40 వేల కోట్లకు పెంచుకున్న సంగతిని మరచిపోయావా ఉత్తమ్ అని ప్రశ్నించారు. 2007 మే 16న జీవో నం.124 ద్వారా రూ.17,875 కోట్లకు ప్రాణహిత - చేవెళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి, 19 నెలల్లోనే అంచనా వ్యయాన్ని రూ.38,500 కోట్లకు పెంచింది కాంగ్రెస్‌ కాదా చెప్పాలన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పంద చేసుకోకుండానే ప్రాజెక్టును ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు ఖరారు చేసి తల వదిలేసి తోక వరకు ఏకకాలంలో పనులు మొదలు పెట్టి అడ్వాన్స్‌ లు దండుకున్నది మీరే కదా అన్నారు. 2010 లో అంచనాలకను రూ.40,300 కోట్లకు సవరించి కేంద్రానికి పంపింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టు మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ల రూపంలో రూ.651.28 కోట్లు, సర్వే, ఇన్వెస్టిగేషన్‌ కోసం రూ.829.51 కోట్లు, పనుల కోసం చెల్లింపులకు రూ.151.93 కోట్లు, భూసేకరణ కోసం రూ.16.93 కోట్లు, ఇతర ఖర్చుల కోసం రూ.14.52 కోటలు మొత్తం కలిపి 2014 జూన్‌ వరకు కాంగ్రెస్‌ ఖర్చు చేసింది రూ.1,426.60 కోట్లు మాత్రమేనని తెలిపారు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా డెకాయిటీ చేసిందో ఈ లెక్కలు స్పష్టం చేస్తాయన్నారు.

కేసీఆర్‌ పాలనలో తెలంగాణ ఆహార పంటల వృద్ధి రేటు పెరుగుదలపై ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ఏం చెప్పిందో తెలియదా ఉత్తమ్‌.. అని ప్రశ్నించారు. 16.42 శాతం వృద్ధితో పంజాబ్‌, హర్యానా, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్రలను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. 2014-15లో రాష్ట్రంలో 1.29 ఎకరాల్లో పంటలు పండితే 2022 -23 నాటికి సాగు విస్తీర్ణం 2.21 కోట్ల ఎకరాలకు పెరిగిందన్నారు. కేసీఆర్‌ అమలు చేసిన వ్యవసాయ అనుకూల విధానాలతోనే ఇది సాధ్యమైందన్నారు. కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ఫలితం కండ్ల ముందే సాక్షాత్కరించిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వదిలేసిపోయిన పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెంచిందన్నారు. కాళేశ్వరంతో పాటు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, భక్తరామదాసు, చౌట్‌ పల్లి హనుమంత్ రెడ్డి, గూడెం తదితర ఎత్తిపోతలు, సింగూర్, కిన్నెరసాని కాలువలు, కొమ్రం భీం, నీల్వాయి, గొల్లవాగు, మత్తడివాగు, ర్యాలివాగు, గడ్డెన్న సుద్దవాగు, పాలెం వాగు, బేతుపల్లి వరద కాలువ ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్‌, ఘన్‌ పూర్‌ ఆనికట్‌, స్వర్ణ, సాత్నాలా, చెలిమెల వాగు, నల్లవాగు, సదర్మాట్‌ ఆధునీకరణ, 28 వేల చెరువుల పునరుద్దరణ, నదులు, వాగులపై చెక్ డ్యాంల నిర్మాణం, చెరువులను ప్రాజెక్టుల కాల్వలతో అనుసంధానం చేయడం ఇలా బహుళ అంచెల వ్యూహాన్ని అమలు చేశామని, అందుకే రాష్ట్రంలో రెండు పంటలకు సాగునీరు అందుతోందని తెలిపారు.

ఎస్సారెస్పీ స్టేజీ -2 కాల్వల నిర్మాణం పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో దాని కింద 4 లక్షల ఎకరాలకు మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వమే నీళ్లిచ్చిందన్నారు. భూగర్భ జలాలు పెరగడం, వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్‌ సరఫరాతో 30 లక్షల బోర్ల కింద సుమారు 45 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశంలోనే నంబర్‌ వన్‌ గా నిలబెట్టిన కేసీఆర్‌ ను డెకాయిట్‌ అనడానికి నోరెలా వచ్చిందని ఉత్తమ్‌ ను ప్రశ్నించారు. ఇంతకన్నా దారుణం, పాపం ఇంకోటి ఉండదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సమ్మక్క సాగర్‌ నిర్మాణం పూర్తి చేయకపోతే దేవాదుల నుంచి 60 టీఎంసీల నీటిని ఎట్లా ఎత్తిపోయగలిగే వారే చెప్పాలని డిమాండ్‌ చేశారు. నీటి నిల్వ లేకుండా దేవాదులను రూపకల్పన చేసిన ఘనత చంద్రబాబు అయితే కంతనపల్లి పేరుతో ఆదివాసీ ఆవాసాలు, అటవీ ప్రాంతాల ముంపు, పర్యావరణ సమస్యలతో ప్రాజెక్టును వదిలేసిన చరిత్ర కాంగ్రెస్‌ ది అని గుర్తు చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన పనులను కాంగ్రెస్‌ తమ విజయాలుగా చెప్పుకోవడం కొత్తేమీ కాదన్నారు. సీతారామ ప్రాజెక్టులో అలాగే మూడు పంపు హౌస్‌ ల స్విచ్‌ ఆన్‌ చేసి తమ ఘనతగా కాంగ్రెస్‌ చెప్పుకుందన్నారు. అప్పుడు ఖమ్మం ప్రజలు నవ్వుకుంటే.. ఇప్పుడు వరంగల్‌ జిల్లా ప్రజల వంతు వచ్చిందన్నారు. కమీషన్ల కోసం జలయజ్ఞం ప్రారంభించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమైతే.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్‌ వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత బీఆర్‌ఎస్‌ ది అన్నారు.

Next Story