వరద ప్రభావ ప్రాంతాలను కేంద్రం ఆదుకోవాలి

ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం రూ.5,438 కోట్లు : సీఎం రేవంత్‌ రెడ్డి

వరద ప్రభావ ప్రాంతాలను కేంద్రం ఆదుకోవాలి
X

భారీ వర్షాలతో వరదలు ముంచెత్తి నష్టపోయిన ప్రాంతాలను కేంద్రం ఆదుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వరద ప్రభావ ప్రాంతాలను కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి శుక్రవారం పర్యటించారు. అనంతరం హైదరాబాద్‌ కు చేరుకున్న కేంద్ర మంత్రి సెక్రటేరియట్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో వరద నష్టం దాదాపు రూ.5,438 కోట్లు ఉంటుందని తెలిపారు. అన్ని విభాగాలు క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టం వివరాలు సేకరిస్తున్నాయని, సమగ్రంగా అంచనాలు వేసిన తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశముందన్నారు. ఖమ్మం, మహబూబ్​నగర్​, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సె.మీ.ల వర్షం కురిసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని, వరద నష్టం భారీగా జరిగిందని వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు. ఒకే రోజులో అంచనాకు మించిన వర్షం పడటంతో ప్రధాన రహదారులతో పాటు రోడ్లు, ఇండ్లు, బ్రిడ్జిలు చాలాచోట్ల పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయిందన్నారు. వరద బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందజేస్తున్నామన్నారు.

భారీ వర్షాలు, వరదలకు చెరువులు, ప్రాజెక్టుల కాల్వలు తెగాయని తెలిపారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల విడుదల, వినియోగంలో నిబంధనలను సవరించాలన్నారు. చెరువులు, కుంటల తక్షణ మరమ్మతులకు రూ.60 కోట్లు అవసరం కాగా, ఇప్పుడున్న రేట్ల ప్రకారం రూ.4 కోట్లు కూడా విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. ఏపీలోనూ భారీ నష్టం జరిగిందని.. విపత్తు సాయం అందజేయడంలో రెండు రాష్ట్రాలను కేంద్రం ఒకే తీరుగా చూడాలని కోరారు. విపత్తులు సంభవించినప్పుడు ఆపదలో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో పార్టీలు, రాజకీయాలకు తావు లేదని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పష్టం చేశారు. కలిసికట్టుగా బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సి ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్రాల్లో వరద సహాయక చర్యల కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధుల్లో తమ వాటాతో కలిపి కేంద్ర ప్రభుత్వం రూ.3,448 కోట్లు మంజూరు చేస్తుందని చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి, సీఎంవో ప్రిన్సిపల్‌ సెక్రటరీ శేషాద్రి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story