కాంగ్రెస్‌లో క్యాబినెట్‌ విస్తరణ లొల్లి

రేవంత్‌ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.హస్తినలో హైకమాండ్‌ ఇచ్చిన షాక్‌తో తాను హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఏం చెప్పాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో క్యాబినెట్‌ విస్తరణ లొల్లి
X

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. సామాజిక సమీకరణల ఆధారంగా చేసిన కసరత్తు కొలిక్కి వచ్చింది. పార్టీ హైకమాండ్‌తో చర్చించి ఫైనల్‌ చేయడానికి సీఎం రేవంత్‌,, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ సహా ముఖ్యనేతలంతా ఇవాళ లేదా రేపు హస్తనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న మంత్రుల శాఖలు కూడా మారవచ్చని నిన్న మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పిన విషయం తెలిసిందే. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నది. కేబినెట్‌ విస్తరణ కోసమే ప్రభుత్వ పరంగా లాంఛనాలు పూర్తి చేయడానికే నిన్న సీఎం గవర్నర్‌తో భేటీ అయ్యారని టాక్‌. గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌ ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే చర్చించినట్టు తెలుస్తోంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంపైనా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. వీసీల నియామకం, కొన్ని కీలక బిల్లులకు సంబంధించిన అంశాలపై సీఎం గవర్నర్‌తో చర్చించినట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్ర కేబినెట్ లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉన్నారు. మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటున్నారు. సామాజిక సమీకరణాల ఆధారంగా 4 మంత్రి పదవులపై ఎంపిక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఈ నాలిగింటిలో రెడ్డిలకు రెండు, వెలమలకు ఒకటి, బీసీలకు ఒకటి దక్కవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి బోధన్‌ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌రెడ్డి లేదా జీవన్‌రెడ్డిలలో ఎవరో ఒకరిని కేబినెట్‌లోకి తీసుకోవచ్చు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొదటి క్యాబినెట్‌లోనే ఆయన బెర్త్‌ ఆశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నెటీజన్లు పెద్దమొత్తంలో బాధపడింది మంచి ఐటీ మినిస్టర్‌ (కేటీఆర్‌ ను ఉద్దేశించి) ను మిస్‌ అయ్యామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టిన విషయం తెలిసిందే. నిజానికి ఈ శాఖను నిర్వహిస్తున్న శ్రీధర్‌బాబు అసెంబ్లీ వ్యవహారాలు, రేవంత్‌ చర్యల వల్ల అసంతృప్తికి గురవుతున్న సీనియర్లను బుజ్జగించడానికే సరిపోతున్నదనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వెలమలకు ఒకటి ఇస్తే మదన్‌ మోహన్‌ రావును పరిగణనలోకి తీసుకుంటారా? లేక మెదక్‌ నుంచి ఎన్నికైన మైనం పల్లి రోహిత్‌కు అవకాశం ఇస్తారా? లేదా ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి జంప్‌ అయిన డాక్టర్‌ సంజయ్‌కి అవకాశం ఇస్తారా? అన్న ఆసక్లి నెలకొన్నది. అయితే మంచిర్యాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడంతో ప్రేమ సాగర్‌రావుకు మంత్రిగా అవకాశం రావొచ్చు అంటున్నారు. బీసీ సామాజివర్గం నుంచి మక్తల్‌ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్‌ పేరు గట్టిగా వినిపిస్తున్నది. మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి ఎవరికి వారు హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దీంతో చివరి నిమిషం వరకు జాబితాపై సస్పెన్షన్‌ కొనసాగవచ్చు.

ఇక భువనగిరి ఎంపీ టికెట్‌ తన భార్యకు లేదా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం చివరి వరకు ప్రయత్నించిన రాజగోపాల్‌రెడ్డికి హైకమాండ్‌ ఆ సందర్భంగానే హామీ ఇచ్చింది. సీఎం సన్నిహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి సహకరించి, ఆయన గెలుపు కోసం కృషి చేస్తే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనకు కేబినెట్‌లోకి బెర్త్ ఖరారైనట్టే సమాచారం. రెడ్డి సామాజికవర్గం నుంచి ఇద్దరికే అవకాశం ఉండగా.. మంత్రి పదవి ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డిలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. నలుగురిలో ఇద్దరికి కేబినెట్‌లో చోటు మరో ఇద్దరికి ఆర్టీసీ ఛైర్మన్‌, ప్రభుత్వ చీఫ్‌ పదవితో సర్దిచెప్పాలని అనుకుంటున్నది. వీళ్లు దానికి అంగీకరిస్తారా? అలక బూనుతారా? అన్నది చూడాలి.

మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నవాళ్ల జాబితా పెద్దగానే ఉన్నది. ఇటీవల ఐదు రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం సహా ముఖ్యనేతలతో హైకమాండ్‌ కొన్ని విషయాలపై కుండబద్దలు కొట్టింది. కాంగ్రెస్‌ టికెట్‌పైనే గెలిచిన వారినే కేబినెట్‌లోకి తీసుకోవాలనే కండిషన్‌ పెట్టింది. ఈ విషయాన్ని సీఎం రేవంతే స్వయంగా వెల్లడించిన విషయం విదితమే.పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లను, సీనియర్లను కలుపుకుని వెళ్లాలనని, ఒంటెద్దు పోకడలు మానుకోవాలని రేవంత్‌కు హితవు పలికింది. పార్టీ దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పింది. దీంతో నిరాశలోకి వెళ్లిన సీఎం వర్గం ఏడు నెలలకే హైకమాండ్‌ వద్ద పతారా మొత్తం పోయిందని వాపోతున్నారట.

అయితే నిన్న మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దానం నాగేందర్‌లకు చోటు దక్కే అవకాశం ఉన్నదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్‌లో చేరుతారని ఆపార్టీ నేతలే లీకులు వదులుతున్నారు. అయితే సీఎం ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలతో కొంతమంది వెనక్కి తగ్గారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యే నాగేందర్‌కు కేబినెట్‌లో చోటు దక్కవచ్చని మంత్రి చేత కావాలనే చెప్పించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, మొన్న చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డిలకు ముఖ్యమంత్రే హామీ ఇచ్చారు. ఈనేపథ్యంలో కొత్తగా కేబినెట్‌లోకి తీసుకునే వారి జాబితాకు సంబంధించిన దాదాపు కసరత్తు పూర్తయ్యింది అని చెబుతున్నా.. హైకమాండ్‌ నిర్ణయం మేరకే ఫైనల్‌ లిస్ట్‌ బైటికి వస్తుంది అంటున్నారు. సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రుల సంప్రదాయాన్ని కొనసాగించే కాంగ్రెస్‌ పార్టీ కేబినెట్‌ భేటీలో రేవంత్‌కు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది అనడానికి లేదంటున్నారు. రేవంత్‌ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.హస్తినలో హైకమాండ్‌ ఇచ్చిన షాక్‌తో తాను హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఏం చెప్పాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేబినెట్‌ విస్తరణ కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు రేపే అవకాశం ఉన్నదంటున్నారు.

Raju

Raju

Writer
    Next Story