రుణమాఫీ, రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌

రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు ఏటా రూ. 12 వేలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కార్యాచరణ

రుణమాఫీ, రైతు భరోసాపై బీఆర్‌ఎస్‌ యాక్షన్‌ ప్లాన్‌
X

రుణమాఫీపై రేవంత్‌ సర్కార్‌ పెట్టిన కొర్రీలతో రాష్ట్రవ్యాప్తంగా 50 శాతానికి పైగా రైతులకు మాఫీ కాలేదు. దీనికి ప్రభుత్వం సాంకేతిక కారణాలను సాకుగా చూపెడుతూ యాప్‌ ద్వారా వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను, నిరసనలను తాత్కాలికంగా తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందనే విమర్శలున్నాయి. రుణమాఫీపై ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర సరైన సమాచారం లేదు. మాఫీ అంటే మమ అన్నట్లు ప్రభుత్వం వ్యవహరించింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం, ఇతర విపక్షాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఏ గ్రామంలోకి వెళ్లినా రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద, బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమకు రుణమాఫీ ఎందుకు కాలేదు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వారికి ఏఈవో, బ్యాంకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. దీంతో రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం తమను నిండా ముంచిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో మంత్రులను, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు.

రుణమాఫీపై ఖమ్మం జిల్లాలో సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు ఉద్రికత్తలకు దారితీశాయి. ఒకసమయంలో మంత్రి అసహనానికి లోనయ్యారు. తనను ప్రశ్నించిన రైతుపై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నట్లు మంత్రి వ్యవహరించారు. ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం సంపూర్ణంగా రుణమాఫీ కావాలంటే ఇంకా రూ. 18 వేల కోట్ల వరకు కావాలని ప్రధాన ప్రతిపక్షం, రైతు సంఘాలు అంటున్నాయి. ప్రభుత్వం మాత్రం చేస్తాం.. చూస్తామంటూ కాలం వెళ్లదీస్తున్నది. దీనికితోడు రైతు భరోసా కూడా ఇప్పటికీ అమలు కావడం లేదు. వాన కాలం ప్రారంభమై రైతులు దుక్కి దున్ని విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకున్నా రైతు బంధు డబ్బులైనా తమ ఖాతాలో వేస్తుందని అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వ చర్యలు చూస్తే ఇవేవీ ఇచ్చే ఉద్దేశం కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా రైతులందరికీ రూ. 2 లక్షల రూపాయలు మాఫీ చేయాల్సిందేనని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేస్తున్నది. రుణమాఫీపై ప్రభుత్వ డొల్లతనాన్ని బైటపెట్టడానికి తెలంగాణ భవన్ లో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. రుణమాఫీ కాని వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నది. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న డిమాండ్‌తో గులాబీ పార్టీ ఇప్పటికే రైతు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కార్యక్రమాలను చేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ రైతు ఐక్య కార్యాచరణ సమితి రుణమాఫీ అమలు చేయడానికి సెప్టెంబర్‌ 15 వరకు గడువు విధించింది. ఇదే సమయంలో ప్రభుత్వం యాప్‌ ద్వారా రుణమాఫీ కాని వారి వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని తదుపరి చేపట్టాల్సిన కార్యక్రమాలపై బీఆర్‌ఎస్‌ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నది. రుణమాఫీ, రైతు భరోసా, కౌలు రైతులకు ఏటా రూ. 12 వేలు వంటి అంశాలపై ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ఖరారు కానున్నదని సమాచారం. బీఆర్‌ఎస్‌ చేపట్టే కార్యక్రమాల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పాల్గొంటరాని తెలుస్తోంది.

Raju

Raju

Writer
    Next Story