బోనమెత్తిన భాగ్యనగరం

భాగ్యనగరంలో బోనాల జాతర షురూ అయ్యింది.నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.

బోనమెత్తిన భాగ్యనగరం
X

ఆషాఢ మాసం వచ్చింది. భాగ్యనగరంలో బోనాల జాతర షురూ అయ్యింది. నేటి నుంచి ఆగస్టు 4 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. నేడు గోల్కొండలోని జగదాంబికా అమ్మవారు తొలి బోనం అందుకోనున్నారు. డప్పు సప్పుళ్లు, తీన్మార్‌ స్టెప్పులతో నగరం మారుమోగనున్నది. పోతురాజుల వీరంగం, శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం సరికొత్త శోభను సంతరించుకున్నది.

ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం బోనాలు పెట్టడం అనేది అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. దశాబ్దాలుగా గోలుకొండ కోటలో జగదాంబికా అమ్మవారు, మహంకాళీ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. నజర్‌ బోనం పేరతో అమ్మవారికి తొలి బోనం అందించిన తర్వాతనే ఈ కార్యక్రమం ప్రారంభమౌతుంది. ఈ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. అనంతరం లంగర్‌ హౌజ్‌ నుంచి అమ్మవారి ఘటాల ఊరేగింపు సాగనున్నది.

నేటి నుంచి తొమ్మిది వారాల పాటు అంటే ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించే ఈ ఉత్సవం అంగరంగ వైభవంగా సాగనున్నది. ఏటా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలని, చల్లగా చూడాలని కోరుతూ బోనాలను సమర్పిస్తారు. ఆషాఢ మాసంలోనే బోనాలు సమర్పించడం అనేది ఆనవాయితీ వస్తున్నది. అనేక ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అక్కడే బోనాలు తయారు చేసి కొండపైన కొలువైన జగదాంబికా అమ్మవారికి సమర్పిస్తారు. డప్పు, డోలు విన్యాసాల మధ్య బోనాల జాతర గోలుకొండ కోటలో మారుమోగుతున్నది. అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను తలపై పెట్టుకుని అమ్మవారికి సమర్పిస్తారు. కోరిన కోరికలు నెరవేరిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తుంటారు. బోనంతో పాటు అమ్మవారికి తొట్టెను కూడా సమర్పిస్తారు.





శివసత్తుల డ్యాన్స్‌లు, పోతురాజుల విన్యాసాలు

9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రకాల పూజలు చేస్తారు. 28న బోనాల వేడుకలు నిర్వహిస్తారు. బోనాల రోజు ఉదయం అమ్మవారికి బైండ్ల వారు బలిహరణ కార్యక్రమం చేస్తారు. అనంతరం దేవాలయ అర్చకులు మహాభిషేకం చేస్తారు. తర్వాత నుంచి భక్తులు బోనాలు సమర్పిస్తారు. అమ్మవారి ఊరేగింపు డప్పు సప్పుల్లు, శివసత్తుల డ్యాన్స్‌లు, పోతురాజుల విన్యాసాల మధ్య అమ్మా బైలెల్లినాదో అంటూ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం భక్తులను కనువిందు చేస్తుంది. గోల్కొండ బోనాల అనంతరం ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, 28,29 తేదీల్లో లాల్‌ దర్వాజ బోనాలు జరగనున్నాయి.

Raju

Raju

Writer
    Next Story