బాబాయి-అబ్బాయి కోటి విరాళం

వరద బాధితులకు అండగా ఉంటామని ముందుకు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ

బాబాయి-అబ్బాయి కోటి విరాళం
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు, వరదలకు జన జీవనం స్తంభించిపోయింది. ఉభయ రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. ఏపీలో విజయవాడ కృష్ణా జిల్లాల పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి. రెండు రాష్ట్రాల్లోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు మూడు రోజులుగా వరద నీటిలోనే ఉంటూ.. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటూ బిక్కుబిక్కుమంటూ బతుకీడుస్తున్నారు. సర్వం కోల్పోయి కట్టబట్టలతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకు వచ్చారు. తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా వరద బాధితులకు తాము అండగా ఉంటామని ముందుకు వచ్చింది. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు చెరో కోటి రూపాయాల భారీ విరాళాన్ని ప్రకటించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. ఉయభ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షల చొప్పున అందించారు.

బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌తో తాము కూడా వరద బాధితులకు మా వంతు సాయం చేస్తామని ముందుకు వచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వరద బాధితులకు సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రూ. కోటి రూపాయల విరాళం ప్రకటించారు.సాయం చేసిన వారిలో యువ హీరోలు విశ్వక్‌సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్‌, నిర్మాతలు ఎస్‌. రాధాకృష్ణ, నాగవంశీ సహా పలువురు తమ వంతు విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటారు.

విశ్వక్‌సేన్‌ ఏపీ, తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఉభయ రాష్ట్రాల సీఎం నిధికి చెరో రూ. 15 లక్షల చొప్పున రూ 30 లక్షలు అందిస్తున్నట్లు వెల్లడించారు.ప్రముఖ డైరెక్టర్‌ రూ. 50 లక్షలు, నిర్మాతలు ఎస్‌. రాధాకృష్ణ, నాగవంశీలు కలిసి రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 25 లక్షల చొప్పున సీఎం సహాయ నిధికి జమ చేశారు. వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వనీదత్‌ ఏపీకి రూ. 25 లక్షల సాయం ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వరదలు చాలామందిని బలి తీసుకున్నాయి. అలాగే ఎంతోమందిని నిస్సహాయుల్ని చేశాయి. చాలామంది ఈ వరదల్లో సర్వం కోల్పోయారు. మీ అందరికీ ఈ కష్ట సమయంలో ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. నా బాధ్యతగా బాధితుల కోసం తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లోల చొప్పున కోటి రూపాయలు ఇరు రాష్ట్రాల సీఎం సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం తనను కలిచి వేసిందని జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలుగు ప్రజలు అతి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన జూనియర్‌ ఎన్టీఆర్‌ ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50 లక్షల విరాళం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

Raju

Raju

Writer
    Next Story