తెలంగాణపై ఏపీ విన్నింగ్ టీమ్ కన్ను

కూటమి ఎంట్రీకి గేట్లు తెరిచిన రేవంత్

తెలంగాణపై ఏపీ విన్నింగ్ టీమ్ కన్ను
X

ఏపీలో గెలిచిన కూటమి తెలంగాణ రాజకీయాల్లోనూ ఇదే రిపిటీ చేయాలని చూస్తున్నది. దీనికి ఇక్కడి ప్రభుత్వం రేవంత్‌ ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పిస్తున్నది. స్థానిక సంస్థల ద్వారా కూటమి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి అని నినదించి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ కొన్నిరోజులుగా అనుసరిస్తున్న విధానాలు తెలంగాణకు తీవ్ర నష్టం చేసేలా ఉన్నాయని తెలంగాణ ఉద్యమకారులు ధ్వజమెత్తుతున్నారు. అందుకే ప్రశ్నిస్తున్న వారిని, నిరసన చేస్తున్న వారిపై అణిచివేత ప్రయోగాన్ని రేవంత్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని అంటున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమాన్ని అణిచివేయడానికి శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయంలో కేంద్ర ప్రభుత్వానికి అనేక సూచనలు చేసింది. ఆ రహస్య నివేదికలో తెలంగాణ ఉద్యమకారులపై ఎలాంటి కుట్రలు చేయవచ్చో, దాన్ని మీడియా ద్వారా ఎలా మేనేజ్‌ చేయవచ్చో సూచించింది. ఈ కుట్రలు తెలంగాణ ప్రజలు ఛేదించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోనూ ముఖ్యంగా చంద్రబాబు తాను సీఎంగా ఉన్నప్పుడు సెక్షన్‌ 8 పేరుతో హైదరాబాద్‌లో రాజకీయం చేయాలని చూశారు. దీన్ని కేసీఆర్‌ ప్రభుత్వం తిప్పికొట్టింది. తెలంగాణ గడ్డ మీద ఇక నాటి కుట్రలు, ఆగడాలకు కాలం చెల్లిందని స్పష్టం చేసింది. దీంతో చేసేదీ ఏమీ లేక ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకుని అమరావతికి వెళ్లారు. ఆ తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తెలంగాణలో రాజకీయాలకు దూరంగా ఉన్నది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా రెండు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తెలంగాణ లో జగన్‌ గాని, ఏపీలో కేసీఆర్‌ గాని తలదూర్చలేదు. దీంతో ఎలాంటి సమస్యలు రాలేదు.

కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో అధికారం మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలనే కాదు దేశాన్ని కుదిపేసిన ఓటు కు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు ఇరు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారం కోసం మాట్లాడుకుందామని చంద్రబాబు, ఆధ్యాత్మిక పర్యటన పేరుతో జనసేనాని, ఏపీ కూటమిని ఇక్కడ కూడా కొనసాగించాలని బీజేపీ కలిసి కొన్నిరోజులుగా తెలంగాణలో మళ్లీ రాజకీయాలు మొదలుపెట్టాయి. దీనికి ఇక్కడి ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడానికి రేవంత్‌ రెడ్డి సహకరించారనే ఆరోపణలున్నాయి. మనం మనం బరంపురం అన్నట్టు వీళ్లంతా బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను బలహీనపరిస్తే తెలంగాణలో మనకు ఇక తిరుగుండదని భావిస్తున్నారు. అందుకే అధికారంలో లేని బీఆర్‌ఎస్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. తెలంగాణకు అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై మొక్కుబడి విమర్శలు, అప్పుడుప్పుడు కొన్ని నిరసనలు చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి.

బీజేపీ, టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల టార్గెట్‌ తెలంగాణ. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని ఇప్పటి నుంచే స్కెచ్‌ వేశాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయబోతున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లను కాషాయపార్టీ చేజిక్కించుకోవాలనుకుంటున్నది. ఖమ్మం, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ వంటి చోట్ల టీడీపీకి సహకరించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నది. వీళ్ల ప్రణాళిక సాఫీగా సాగాలంటే బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో లేకుండా చేయాలి. అందుకే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పార్టీ ఫిరాయించేలా చేస్తున్నారు. తెలంగాణపై ఈ మూడు పార్టీలు అప్పుడప్పుడు అక్కసు వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలకు తనకు రెండు కండ్లు అనే చంద్రబాబు ఇక్కడ మనం ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకుంటుంటే ఆయన అమరావతిలో రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారని నిరసన చేపడుతారు. ఇంకొకాయన తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందిన తర్వాత 11 రోజులు తిండి తినలేదని చెప్పారు. మోడీ అయితే తెలంగాణ ఏర్పాటే అశాస్త్రీయం అని పార్లమెంటులోనే అనేకసార్లు తన అజీర్తిని వెళ్లగక్కాడు.

ఏడు నెలల కాంగ్రెస్‌ పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన పార్టీలు మళ్లీ యాక్టివేట్‌ అయ్యాయి. నగరంలో భారీగా కటౌట్‌లు, ర్యాలీలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచే మళ్లీ పార్టీలకు పురుడు పోయడానికి కార్యాచరణ మొదలుపెట్టాయి. ఇవన్నీచూస్తున్న తెలంగాణ వాదులు బహిరంగంగానే రేవంత్‌ సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు బద్ధ వ్యతిరేకులతో కలిసి ఊరేగుతూ ఈ రాష్ట్రాన్నిఏం చేయాలనుకుంటున్నారని నిలదీస్తున్నారు. ఏడు నెలల కిందట కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లలో చాలామంది రాష్ట్రంలో రేవంత్‌ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు చూసి ఆత్మరక్షణలో పడ్డారు. ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాన్ని అణిచివేయడానికి అనుసరించిన పద్ధతులనే ప్రస్తుతం రేవంత్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నదని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్న వారితో రేవంత్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు రానున్న రోజుల్లో ప్రమాదానికి సంకేతాలని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలలు ప్రజల్లోకి వెళ్లాయి. ఏడు నెలల కాలంలోనే వాళ్లంతా రోడ్లపై వచ్చిన నిరసనలు తెలిపే పరిస్థితులు నెలకొన్నాయి. వీళ్లకు ఉద్యమకారులు కూడా మద్దతు తెలుపడంతో వాళ్లను పదవులు ఇస్తామని, మౌనంగా ఉండాలని రేవంత్‌ సర్కార్‌ రాయబారాలు పంపుతున్నట్టు సమాచారం. కానీ నమ్మి నాన బోస్తే పుచ్చి బుర్రెలైనట్టు ఇంకా రేవంత్ ను నమ్మితే చరిత్రలో తప్పుచేసిన వాళ్లం అవుతామంటున్నారు. ఏడు నెలల కాలంలోనే మళ్లీ మొదటికి తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఇవాళ తెలంగాణలో ఏపీ కూటమి ఇక్కడ కూడా అదే ప్రయోగాన్ని అమలు చేయాలని చూస్తున్నదంటే దానికి కారణం రేవంత్‌ చేస్తున్న రాజకీయాలే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ఈ కుట్రలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో పూడ్చుకోలేనంత నష్టం జరుగుతుందని అంటున్నారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యమౌతున్నారు.

Raju

Raju

Writer
    Next Story