కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం

ఆ రాష్ట్ర రాజకీయాలను ఇప్పటికే కుదిపేస్తున్న ముడా, వాల్మీకి స్కామ్‌లు

కర్ణాటకలో మరో కుంభకోణం కలకలం
X

కర్ణాటకలో జరిగిన వాల్మీకి స్కామ్ ప్రకంపనలు కొనసాగుతుండగానే ఆ రాష్ట్రంలో మరో కుంభకోణం కలకలం సృష్టిస్తున్నది. కొవిడ్‌ సమయంలో కోట్లాది రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు తాజాగా నివేదికలో వెల్లడైంది. జస్టిస్‌ జాన్‌ మైఖెల్‌ కమిటీ ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని కీలక పత్రాలు కనిపించకుండా పోయినట్లు ఆ కమిటీ గుర్తించింది. దీనిపై సీఎం సిద్ధరామయ్య క్యాబినెట్‌లో చర్చించారు. బీజేపీ హయాంలో చోటుచేసుకున్న ఈ అక్రమాలపై చర్యలకు సిద్ధమౌతున్నది.

రాష్ట్రంలో కోవిడ్ సమయంలో మొత్తం రూ 13,000 కోట్లు ఖర్చు చేశారు. అయితే దానిని అధికారికంగా ఎక్కడా ప్రస్తావించలేదు. అందులో సుమారు రూ. 1000 కోట్లు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుది రూపు ఇవ్వనున్నారు.

ముడా స్కామ్‌ వచ్చిన తరుణంలోనే 'కొవిడ్‌' కుంభకోణం నివేదిక తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ అసహనానికి గురయ్యారు. ముడా వ్యవహారంపై విమర్శలు రావడం రెండు నెలలు కూడా కాలేదు. కానీ జస్టిస్‌ జాన్‌ మైఖెల్‌ కమిటీ ఏడాది కిందట ఏర్పాటు చేశారు. అసలు ఈ రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.

కర్ణాటక రాజకీయాల్లో మైసూర్‌ నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్‌థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ అనుమతి ఇచ్చారు. ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సీఎం భార్య పార్వతితోపాటు మరికొందరి ప్రమేయం ఉన్నదనే ఆరోపణలున్నాయి. ఈ కుంభకోణంపై అధికార కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పొలిటికల్‌ వార్‌ నడుస్తున్నది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను అస్థిరపరచడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. గవర్నర్‌ చర్యలను నిరసిస్తూ.. ఆయనకు వ్యతిరేకంగా కొన్నిరోజులుగా సీఎం సిద్ధరామయ్య సహా కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేస్తున్నారు.

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరే షన్‌ లిమిటెడ్‌కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన రూ. 187 కోట్లు పక్కదారి పట్టాయి. రూ. 187 కోట్లలో తెలుగు రాష్ట్రాలకు రూ. 90 కోట్లు చేరినట్టు సిట్‌ అంతర్గత నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్‌లోని ఆర్బీఎల్‌ బ్యాంకు చెందిన 9 ఖాతాలకు రూ. 44.6 కోట్లు బదిలీ అయ్యాయి. ఈ నగదుతో లోక్‌సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మద్యం, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను తొలిగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలుతుందని కర్ణాటక మంత్రి సతీశ్‌ జార్కిహోళి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీ ల పాలనలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బైటికి రావడంపై రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏం జరగబోతున్నది? అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Raju

Raju

Writer
    Next Story