హైడ్రా పేరుతో సర్కారు రాజకీయ కుట్ర

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోంది : మాజీ మంత్రి హరీశ్ రావు

హైడ్రా పేరుతో సర్కారు రాజకీయ కుట్ర
X

హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలకు తెరతీసిందని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుడిని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్ కప్పుకోకుంటే ఇబ్బందులు తప్పవని రేవంత్ హెచ్చరిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి వారి ఆస్తులను కూల్చేసే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ కేసులు పెట్టి, రూ.300 కోట్ల ఫైన్ వేసి.. నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ కండువా కప్పారని గుర్తు చేశారు. ఆయన పార్టీ మారగానే మైనింగ్ కేసు అటకెక్కిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఆరు కేసులు పెట్టిందని, ఆయన భార్య, పిల్లలపైనా కేసులు పెట్టారని తెలిపారు. మానసికంగా, రాజకీయంగా ఇబ్బంది పెడుతోందని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.

పల్లా రాజేశ్వర్ కాలేజీలో ఇంచు ప్రభుత్వ భూమి ఉన్నా 24 గంటల్లోనే తొలగిస్తారని తెలిపారు. అన్ని అనుమతులతోనే మెడికల్ కాలేజీ నిర్మించారని, అక్కడ ఎంతో మంది వైద్యం పొందుతున్నారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే కాలేజీలు, విద్యాసంస్థలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో ఆ నిర్మాణాలు లేవని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సర్వే చేసి రిపోర్టు ఇచ్చాయన్నారు. 813 సర్వే నంబర్ లో బఫర్ జోన్ లోని భూమి లేదని అప్పటి కలెక్టర్ రిపోర్టు ఇచ్చారని తెలిపారు. అక్రమాలను తాము ఎప్పుడూ సమర్థించబోమన్నారు. రాజకీయ ప్రేరేపిత చర్యలు సరికాదన్నారు. తమ చేతుల్లో అధికారం ఉందని రాత్రికి రాత్రే బుల్డోజ్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని.. అన్ని పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డిలను టార్గెట్ చేసిందని .. వారి కాలేజీల్లో సీట్లు పెంచుకునే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ నిర్మాణాలు, ఎఫ్ టీఎల్ పరిధిని మీడియా సమక్షంలోనే కొలువాలని కోరారు.

రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలు, సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో ఇద్దరు జ్వరాలతో బాధ పడుతున్నారని.. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. విష జ్వరాలపై నిత్యం పత్రికల్లో వస్తున్న వార్తలే దీనికి నిదర్శనమన్నారు. డెంగీతో ప్రజలు మరణిస్తున్నారని ఈ రోజు కూడా పత్రికల్లో వార్తలు వచ్చాయన్నారు. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. డెంగీ, మలేరియా, చికున్ గున్యాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో జ్వరపీడితులకు కనీసం బెడ్లు కూడా దొరకడం లేదన్నారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో బెడ్ల కోసం ప్రజలు తమకు ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. నిరుటితో పోలిస్తే రాష్ట్రంలో డెంగీ కేసులు 36 శాతం పెరిగాయని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవన్నారు. గాంధీ హాస్పిటల్ లో సాధారణ మందులు కూడా అందుబాటులో లేవని, ప్రభుత్వం ఈ అంశాలపై కనీసం రివ్యూ చేయడం లేదన్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ అధ్వనంగా మారిందన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంతలా పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.

రుణమాఫీపై కుంటిసాకులు చెప్పడం కాదు శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఆర్మూరులో రైతులే రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. రుణమాఫీపై పెట్టిన గడువులన్నీ జోక్ అయిపోయాయని.. డైవర్షన్ పాలిటిక్స్ చేయడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. రైతులకు వెంటనే రైతుభరోసా సాయం అందజేయాలన్నారు. కాంగ్రెస్ అలవికానీ హామీలిచ్చి గత ప్రభుత్వం అప్పులు చేసిందని తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఎనిమిది నెలల్లో రూ.65 వేల కోట్లు అప్పులు చేసిందన్నారు. అంటే నెలకు రూ.8,125 కోట్ల అప్పు చేస్తోందని తెలిపారు. ఈ రూ.65 వేల కోట్లలో ఎఫ్ఆర్ బీఎం పరిధిలో చేసిన అప్పులు రూ.42,118 కోట్లు అయితే.. కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులు రూ.22,840 కోట్లు అని తెలిపారు. ఈ లెక్కనే అప్పులు చేస్తూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పులు రూ.4,87,500 కోట్లకు చేరుతాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో చేసిన అప్పు రూ.2.60 లక్షల కోట్లు మాత్రమేనని తెలిపారు. ఎనిమిది నెలల్లోనే ఇంత భారీ అప్పులు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం కు అప్పుల గురించి మాట్లాడే హక్కు లేద్నారు. డిప్యూటీ సీఎం ఇంకా అబద్ధాలే ప్రచారం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన చేతగాని రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. సమస్యల వలయంలో రాష్ట్రం ఉంటే రాజకీయ కుట్రలకే ఈ ప్రభుత్వం పరిమితమవుతోందన్నారు.

Next Story