స్టే తెచ్చుకునే సమయం ఇవ్వం: రంగనాథ్‌

ఆక్రమ నిర్మాణాలని తేలితే నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తామని..కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని రంగనాథ్‌ వార్నింగ్‌

స్టే తెచ్చుకునే సమయం ఇవ్వం: రంగనాథ్‌
X

హైదరాబాద్‌లోని చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో, బఫర్‌ జోన్‌లలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నది. దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నా హైడ్రా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. గ్రేటర్‌ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గగన్‌ పహాడ్‌లోని అప్పా చెరువు, మామిడి చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై అన్ని వివరాలు సేకరించిన, అక్రమ నిర్మాణాలు నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చివేస్తారని యజమానులు ప్రశ్నిస్తుంటే అక్రమ నిర్మాణాలు అని తేలితే ఎలాంటి నోటీసులు ఇవ్వమని హైడ్రా అధికారులు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టి వాణిజ్య కార్యకలాలు చేపడితే.. హైడ్రా ఎంక్వైరీ చేస్తుందని, కూల్చివేతలు చేపడుతుందన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వదని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథి పాల్గొన్న హైడ్రా కమిషనర్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కబ్జాదారులకు వార్నింగ్‌ ఇచ్చారు. చెరువులు కబ్జా చేసి నిర్మాణాలు చేస్తే ఊరుకోబోమన్నారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తామన్నారు. కబ్జాలు చేసి, కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. స్టే తెచ్చుకునే టైం కూడా ఇవ్వమన్నారు. రెండు, మూడు గంటల్లోనే కూల్చేస్తామని రంగానాథ్‌ చెప్పారు. పలుకుబడి ఉన్న నేతలే చెరువులు కబ్జా చేస్తున్నారని, కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని ఆయన సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. నోటీసులు ఇచ్చి స్టే తెచ్చుకునే దాకా వేచి చూడమన్నారు. అలాగే చాలామంది అధికారుల పాత్ర ఇందులో ఉన్నదని, వారిలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇటీవల ఆరుగురిపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతికి స్వయంగా రంగనాథే లెటర్‌ రాశారు. అందులో వాళ్లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని, జైలుకు పంపాలని సిఫార్సు చేశారు.

ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ అనే అంశాలు ఇప్పటివి కావని, ఎప్పటి నుంచో ఉన్నవేనని అన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పట్టా భూములుంటే వ్యవసాయం చేసుకోవాలి గాని నిర్మాణాలు చేపట్టరాదన్నారు. పట్టా పేరుతో వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే కూల్చివేతలు తప్పవన్నారు. ఇటీవల ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతను ఈ సందర్భంగా రంగనాథ్‌ ఉదహరించారు. భూముల ధరలు పెరిగినందునే ఆక్రమణలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. కొంతమంది పెద్ద బిల్డర్లు భవన నిర్మాణ వ్యర్థాలతో చెరువులను పూడ్చివేస్తున్నారని, వాటిని క్రమంగా చదును చేసి ఆక్రమించుకుంటున్నారని రంగనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా చెరువులు, నాలాలు కుంచించుకపోయి వరద నీరు నగరాన్ని ముంచెత్తుతున్నదని వివరించారు.

కూల్చివేతలకు వెళ్లే ముందు ఆయా నిర్మాణాలకు సంబంధించి లోతైన అధ్యయనం చేస్తున్నామన్నారు. పక్కా ప్రణాళికతోనే అడుగు ముందుకు వేస్తున్నట్లు రంగనాథ్‌ స్పష్టం చేశారు. 2,3 నెలలు హడావుడి చేసి వదిలేయకుండా పదేళ్లలో నగర రూపురేఖల్ని మార్చే పనిచేస్తున్నట్లు తెలపారు. ప్రస్తుతం హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్‌ వరకే ఉన్నప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందన్నారు. అలాగే హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీపైనా హైడ్రా నిఘా ఉంటుందన్నారు. అక్రమ అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్‌ విచారణ చేస్తుందని రంగనాథ్‌ తెలిపారు. నిజాయితీ గల బిల్లర్లను హైడ్రా ఇబ్బంది పెట్టదన్న కమిషనర్‌ ఎవరైనా అధికారులు బిల్డర్లను వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Raju

Raju

Writer
    Next Story