విరాట్‌ విశ్వరూపం.. దక్షిణాఫ్రికా లక్ష్యం 177

టీ 20 వరల్డ్ కప్‌ ఫైనల్‌లో కోహ్లీ ఫామ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. విరాట్‌ దూకుడుకు తోడు అక్షర్‌పటేల్‌, శివమ్‌ దూబెల కీలక ఇన్సింగ్స్‌తో భారత్‌ 176/7 రన్స్‌ చేయగలింది.

విరాట్‌ విశ్వరూపం.. దక్షిణాఫ్రికా లక్ష్యం 177
X

టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో టాస్‌ గెలిచి భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నది. ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌ రోహత్‌ శర్మ, స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లీ మార్కో యాన్సెన్‌ వేసిన మొదటి ఓవర్‌లోనే విరాట్‌ విశ్వరూపం చూపెట్టాడు. మూడు ఫోర్లు కొట్టి అభిమానులను అలరించాడు. మొదటి ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 15-0 గా ఉన్నది. రెండో ఓవర్‌లోనూ ఓపెనర్లు అదే దూకుడు ప్రదర్శించారు. కేశవ్‌ మహరాజ్‌ వేసిన రెండో ఓవర్‌ రోహిత్‌ వరుసగా రెండు బౌండరీలు బాదాడు. నాలుగో బంతికి క్లాసెస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్‌ పంత్‌ మహరాజ్‌ వేసిన చివరి బంతికి వికెట్‌ కీపర్‌ డికాక్‌ క్యాచ్‌ ఇచ్చి డకౌట్ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌ మూడో ఓవర్‌లో జాగ్రత్తగా ఆడారు. కగిసో రబాడ వేసిన ఆ ఓవర్ లో మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. 4 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 32-2 గా ఉన్నది. రబాడ వేసిన 4.3 ఓవర్‌కు సూర్యకుమార్‌ (3) క్లాసెస్‌ క్యాచ్‌ ఇచ్చి భారత అభిమానులను నిరాశ పరిచాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌ పటేల్‌ ఆచితూచి బ్యాటింగ్‌ చేయడంతో పవర్‌ ప్లే ముగిసే సరికి భారత్‌ స్కోరు 43-3 గా ఉన్నది.

సఫారీ జట్టు అటు బౌలింగ్‌లోనూ ఫీల్డింగ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఏడో ఓవర్‌లో పెద్దగా పరుగులేమీ రాలేదు. నాలుగు సింగిల్స్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎనిమిదో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్సర్‌ బాదాడు. దీంతో భారత అభిమానుల్లో ఉత్సాహం మళ్లీ మొదలైంది. విరాట్‌, అక్షర్‌ నిలకడగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో తొమ్మిదో ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 63-3. కోహ్లీ (31) అక్షర్‌ (25) రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. షంసి వేసిన ఓవర్‌లో భారత్‌ 10 పరుగులు రాబట్టింది. మార్కో యాన్సెన్‌ వేసిన 11 ఓవర్‌లో ఆరు సింగిల్స్‌ ఒక వైడ్‌ వచ్చాయి. షంసి వేసిన 12 ఓవర్‌లో ఐదవ బంతిని అక్షర్‌ సిక్సర్‌గా మలిచాడు. ఈ ఓవర్‌లో మొత్తం 11 రన్స్‌ రాగా.. కోహ్లీ (41) హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. అన్రిచ్‌ నోకియా వేసిన 13 ఓవర్‌లో పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో ఆ ఓవర్‌లో 5 రన్స్‌ మాత్రమే వచ్చాయి. అప్పటివరకు దూకుడు ఆడుతున్న అక్షర్‌ పటేల్ 14 ఓవర్‌లో మొదటి బాల్‌కే సిక్సర్‌ కొట్టి మూడో బాల్‌కు రనౌట్‌ అయ్యాడు. తర్వాత వచ్చిన శివమ్‌ దూబె 15 ఓవర్‌లో మార్కో యాన్సెన్‌ వేసిన తొలి బంతికే సిక్సర్‌ కొట్టాడు. ఈ ఓవర్‌ ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 118-4. షంసి వేసిన 16 ఓవర్‌లో ఎనిమిది రన్స్‌ వచ్చాయి. ఈ ఓవర్‌ దూబె ఫోర్‌ కొట్టాడు. నోకియా వేసిన 17 ఓవర్‌లో మొదటి ఐదు బంతుల్లో నాలుగు సింగిల్స్‌ వచ్చాయి. ఈ క్రమంలోనే కోహ్లీ (50) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన అనంతరం కోహ్లీ రబాడ వేసిన 18 ఓవర్‌లో 6+2+4+1 సాధించాడు. దూకుడుగా ఆడుతున్న విరాట్‌ (76: 59 బంతుల్లో) మార్కో యాన్సెన్‌ వేసిన 19 ఓవర్‌లో ఒక సిక్స్‌, ఒక ఫోర్‌ కొట్టి ఐదో బంతికి రబాడకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి భారత్‌ స్కోరు 167-5. శివమ్‌ దూబె (22), పాండ్యా (4) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నోకియా వేసిన 20 ఓవర్‌లో శివమ్‌ దూబె ఫోర్‌ బాది తర్వాత బంతికే లాంగాఫ్‌లో మిల్లర్‌ చేతికి చిక్కాడు.దూబె కీలక ఇన్సింగ్స్‌ ఆడాడు. 16 బంతుల్లోనే 27 రన్స్‌ సాధించాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌, నోకియా చెరో 2 వికెట్లు తీయగా..జాన్ సెన్‌, రబాడ తలో వికెట్ పడగొట్టారు.

Raju

Raju

Writer
    Next Story