పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ

400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్‌లో కాంస్యాన్ని ముద్దాడిన దీప్తి జీవాంజి

పారాలింపిక్స్ లో చరిత్ర సృష్టించిన ఓరుగల్లు బిడ్డ
X

అథ్లెట్‌ జీవాంజి దీప్తి మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌ క్రీడల్లో ఓరుగల్ల బిడ్డ సత్తా చాటింది. పారాలింపిక్స్‌లో చరిత్రలో పతకం సాధించిన క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్‌ దీప్తి జివాంజి చరిత్ర సృష్టించింది. మంగళవారం రాత్రి పారిస్‌లో జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్‌లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఉక్రెయిన్‌ అమ్మాయి యులియా షులియార్‌ 55.16 సెకన్లతో స్వర్ణం సాధించింది. ఆండర్‌ ఐజెల్‌ (తుర్కియే) 55.23 సెకన్లతో రజతం గెలిచింది. ఒకదశలో రెండోస్థానంలో ఉన్న దీప్తి చివర్లో కొంచెం వెనుకబడింది. ఈ క్రీడల ముందువరకు 400 మీటర్ల టీ-20 విభాగంలో ప్రపంచ రికార్డు దీప్తిదే. ప్రస్తుత క్రీడల్లో హీట్స్‌ ఐజెల్‌ 54.96 సెకన్లతో బద్దలు కొట్టింది.

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

20కి చేరిన భారత్‌ పతకాల సంఖ్య

పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 20కి చేరింది. మంగళవారం భారత పారా అథ్లెట్‌లు అద్భుత ప్రదర్శన చేయడంతో రెండు రజత పతకాలు సహా మొత్తం ఐదు పతకాలు దేశానికి అందించారు. జావెలిన్‌ త్రోలో భారత్‌కు మరో రెండు పతకాలు వచ్చాయి.ఎఫ్‌46 విభాగం ఫైనల్‌లో పారా అథ్లెట్‌ అజీత్‌ సింగ్‌ ఈటెను 65.62 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో పోటీ పడిన మరో పారా అథ్లెట్‌ సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ 64.96 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. అటు హైజంప్‌లోనూ భారత్‌కు రెండు పతకాలు వచ్చాయి.

Raju

Raju

Writer
    Next Story