ఫైనల్‌ ఆడలేకపోయినా.. ఛాంపియన్‌వే: ప్రముఖుల ఓదార్పు

ఫైనల్‌కు ముందు ఫొగాట్‌పై వేటు పడటంపై దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఫొగాట్‌ను ఓదార్చారు.

ఫైనల్‌ ఆడలేకపోయినా.. ఛాంపియన్‌వే: ప్రముఖుల ఓదార్పు
X

ఫైనల్‌కు ముందు ఫొగాట్‌పై వేటు పడటంపై దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఫొగాట్‌ను ఓదార్చారు. ఫైనల్‌ ఆడలేకపోయినా.. ఛాంపియన్‌వే అంటూ ప్రశంసించారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఆమె ఇంటికి వెళ్లి కుటుంసభ్యులను కలిశారు. ప్రభుత్వం ఆమెకు పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 140 కోట్ల మంది భారతీయ మనసుల్లో వినేశ్‌ ఛాంపియన్‌ అని రాష్ట్రపతి కొనియాడారు. వినేశ్‌ ప్రతిభ దేశానికి గర్వకారణమని ప్రధాని మోడీ ప్రశంసించారు. దేశమంతా అండగా ఉన్నదని భరోసానిచ్చారు.

ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం దురదృష్టకరమని ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ఘటనతో కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో ఆమె మళ్లీ రంగంలోకి దిగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వినేశ్‌ ఫైనల్‌కు అర్హత సాధించకపోవడం పై సమగ్ర విచారణ జరపాలని ఎస్సీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో వాస్తవాలు బైటికి రావాలన్నారు. వినేశ్‌ స్వర్ణ పతకానికి చేరువైన సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని మాజీ క్రికెటర్‌ హర్బజన్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. 100 గ్రాముల బరువు అధికమని ఓ అథ్లెట్‌పై అనర్హత విధించడం నిరుత్సాహ పరిచిందన్నారు. ఫొగాట్‌పై అనర్హత వార్త కలవరపెట్టే అంశమని ఎన్సీపీ సీనియర్‌ నేత ప్రఫుల్‌ పటేల్‌ అన్నారు. ఫొగాట్‌కు స్వర్ణం ఖాయమని దేశమంతా భావించిందని కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్‌ ఆశోకా అన్నారు.

వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటుపై సవాల్‌ చేయడానికి సమయం తక్కువగా ఉన్నా..సాధ్యమైనంత వరకు ప్రయత్నించినట్టు రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌ తెలిపారు. వినేశ్‌పైయునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ అనర్హత నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఐఓవో సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషకు ప్రధాని సూచించినట్లు కేంద్ర క్రీడా మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ లోక్‌సభలో తెలిపారు. వినేశ్‌ ఫొగట్‌పై అనర్హతవేటు పడటంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి.ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. ఆమెకు న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఫొగట్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేశారు. వాస్తవంగా ఏం జరిగిందో ప్రభుత్వం తెలియజేయాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఫొగట్‌పై కుట్ర జరిగి ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ రణ్‌దీప్‌ సుర్జేవాలా ఆరోపించారు.

Raju

Raju

Writer
    Next Story