ట్రిపుల్ ఆర్ భూసేకరణ మొదలు పెట్టండి

రీజినల్ రింగ్ రోడ్డు ప్రగతిపై కలెక్టర్లు ప్రతి రోజు రివ్యూ చేయాలి..భవిష్యత్ అవసరాలకు తగినట్టుటగా అలైన్మెంట్ లో మార్పులు చేయండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

ట్రిపుల్ ఆర్ భూసేకరణ మొదలు పెట్టండి
X

రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి భూసేకరణ వెంటనే మొదలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సెక్రటేరియట్ లో ట్రిపుల్ ఆర్ పై ఉన్నతాధికారులు, దాని పరిధిలోని జిల్లా కలెక్టర్ లతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భూసేకరణ తో పాటు రీజినల్ రింగ్ రోడ్డు ప్రగతిపై కలెక్టర్లు ప్రతి రోజు సమీక్ష నిర్వహించి ఆ వివరాలను తనకు పంపాలని సూచించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో భూసేకరణ సహా ఇతర అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భూ సేకరణలో ఇంకా వేగం పెంచాలని ఆదేశించారు. ఉత్తర ప్రాంతంలో భూసేకరణ తో పాటు ఇతర అంశాలపై ప్రతి రోజూ తనకు నివేదిక పంపాలన్నారు. రీజినల్ రింగ్ పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఆ రోజు సాధించిన ప్రగతిపై అదే రోజు సాయంత్రం చీఫ్ సెక్రటరీకి నివేదిక ఇవ్వాలన్నారు. భూసేకరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వద్దని, పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ట్రిపుల్ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు కో ఆర్డినేట్ చేయడానికి సీఎస్, మౌలిక వసతులు, ప్రాజెక్టుల సహాదారు శ్రీనివాస రాజు, సీఎం ఓఎస్డీ షానవాజ్ ఖాసీం, జిల్లాల కలెక్టర్లు, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నారు. ఆ గ్రూప్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ పోస్ట్ చేయాలని సూచించారు.

రీజినల్ రింగ్ రోడ్డుపై తాను నిర్వహించే ఒక సమీక్ష సమావేశానికి మరో సమావేశానికి మధ్య కాలంలో పనుల్లో పురోగతి తప్పనిసరిగా ఉండాలన్నారు. ట్రిపుల్ ద‌క్షిణ భాగంలోని సంగారెడ్డి,-ఆమ‌న్‌గ‌ల్‌-, షాద్ న‌గ‌ర్‌, -చౌటుప్పల్ పొడవు 189.20 కి.మీ.లు అని.. దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉత్తర భాగానికి సంబంధించిన భూసేకరణ చాలా వరకు పూర్తి చేశామన్నారు. సీఎం జోక్యం చేసుకొని అలైన్మెంట్ సహా ఏవైనా సాంకేతిక సమస్యలుంటే కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిష్కరించుకోవాలన్నారు. రీజినల్ రింగ్ నిర్మాణ ప్రాంతానికి సంబంధించిన గూగుల్ మ్యాప్ లను సీఎం పరిశీలించారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్ మెంట్ లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. భవిష్యత్ అవసరాలే ప్రాతిపదికగా అలైన్ మెంట్ ఉండాలన్నారు. తాను సూచించిన మార్పులను అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్లు నిర్మించాలని, అంతకుముందే అవి ఎక్కడెక్కడ మెయిన్ రోడ్లతో లింక్ కావాలి, సిగ్నల్స్.. ఇతర సమస్యలు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలించాలన్నారు. అక్కడ ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, సంస్థలకు ఉపయోగపడేలా ట్రిపుల్ ఆర్,ఫ్యూచర్ సిటీలోని రేడియల్ రోడ్లు, ఇతర నిర్మాణాలు ఉండాలన్నారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ కుందూరు జయవీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు వికాస్ రాజ్, శేషాద్రి, దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.

Next Story