పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన మీరే డెకాయిట్లు

మంత్రి ఉత్తమ్‌ నోరు అదుపులో పెట్టుకోవాలి : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన మీరే డెకాయిట్లు
X

పట్టపగలు నోట్ల కట్టలతో దొరికిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దలే డెకాయిట్లని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను ఉద్దేశించి డెకాయిట్‌ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడటంపై శనివారం మీడియా సమావేశంలో జగదీశ్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. వాళ్ల సీఎం రేవంత్‌ రెడ్డి గురించి అనాల్సిన మాటలను మంత్రి ఉత్తమ్‌ తమపై వాడుతున్నారని, రేవంత్‌ ను అనడం చేతగాక కేసీఆర్ పై ఏడుస్తున్నారని అన్నారు. ఉత్తమ్‌ భాష మార్చుకోవాలని సూచించారు. పదేళ్లలో కేసీఆర్‌ ఎప్పుడూ తాము ఇలాంటి మాటలు మాట్లాడనీయలేదన్నారు. తనకంటే వెనుక వచ్చిన వాడు సీఎం పదవి గుంజుకుంటే ఆపలేకపోయిన చేతగాని దద్దమ్మ ఉత్తమ్‌ అన్నారు. రాష్ట్రంలో డెకాయిట్ల పాలన సాగుతోందన్నారు. రాష్ట్రమంతటా కాంగ్రెస్‌ నాయకుల కమీషన్లు, దోపిడీ గురించే మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులను వాడుకొని నీటిని అందించడం చేతగాక తమపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రవ్యప్తంగా ప్రజలు నీళ్లు, కరెంట్‌ కోసం ధర్నాలు చేస్తున్నారని, మంత్రులకు చేతనైతే ముందు వాటి గురించి మాట్లాడాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే నిన్న రేవంత్‌ రెడ్డికి పడ్డ చీవాట్లు ఉత్తమ్‌ కు తప్పవన్నారు. తిట్లదండకంతో ఉత్తమ్‌ ఎప్పటికీ సీఎం కాలేరన్నారు. సాగునీటి కోసం ఇలాగే ధర్నాలు కొనసాగితే యాసంగి సీజన్‌ నాటికే కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని వాళ్లెవరూ ప్రజల్లో తిరగలేరన్నారు. ప్రజాధనం ఖర్చు చేసి హెలీక్యాప్టర్లలో తిరుగుతూ ఉత్తమ్‌ సొల్లు కబుర్లు చెప్తున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్‌ మంత్రిగా ఉత్తమ్‌ ఫెయిల్‌ అయ్యారని, చేతగాకపోతే పదవి గురించి పునరాలోచన చేస్తే మంచిదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవ్వలేకపోతే రైతుల చేతిలో కాంగ్రెస్‌ నాయకులకు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. తమను ఆదుకోవాలని రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో రైతులను కలవడానికి కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకునేలా చేస్తామన్నారు. కేసీఆర్‌ కార్యాచరణను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

Next Story