సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేనా?

ప్రధాని నరేంద్రమోడీ రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏలారు. కానీ మూడోసారి మెజారిటీ మార్క్‌ను చేరుకోలేకపోడంతో మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది.

సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేనా?
X

ప్రధాని నరేంద్రమోడీ రెండుసార్లు సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏలారు. కానీ మూడోసారి మెజారిటీ మార్క్‌ను చేరుకోలేకపోడంతో మొదటిసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎంతకాలం సజావుగా సాగుతుందనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూల మద్దతుతోనే ఏర్పడిన సంగతి తెలిసిందే. గత రెండు పర్యాయాలు సొంతంగానే మెజారిటీ సాధించడంతో మోడీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే సాహసం పార్టీలోని సీనియర్లు గాని, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలు గాని చేయలేదు. కానీ ఆసారి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటాం. కలిసి సాగుతామని ఎన్డీఏ పార్లమెంటరీ పక్ష సమావేశంలో మోడీ అన్నారు. కానీ ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో తెలియదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లను కేంద్రం ముందు పెట్టారు. వాటిని పరిష్కరించాలి. భవిష్యత్తులోనూ ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ నేపథ్యంలో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడిపిన మోడీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపడం సవాళ్లతో కూడుకున్నదే. కేంద్రంలో పీవీ, వాజ్‌పేయ్‌, మన్మోహన్‌ లాంటి వాళ్లు సంకీర్ణ ప్రభుత్వాలను పూర్తిస్థాయిలో నడుపగలిగారు. వాళ్ల ప్రభుత్వాలకు మద్దతు భాగస్వామ్యపక్షాల అభిప్రాయాలను, అభ్యంతరాలను గౌరవించారు. ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో ఏమైనా మార్పులు చేర్పులు సూచిస్తే స్వీకరించారు. కానీ ఇప్పుడు మోడీ ఆ ముగ్గురు ప్రధానుల వలె అందరి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ఐదేళ్లు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడుపుతారా? అంటే ఇప్పుడే చెప్పలేం అంటున్నారు. ఎందుకంటే మోడీ సీఎంగా పదిహేనేళ్లు, ప్రధాని పదేళ్లు పనిచేసినా బీజేపీకి సొంత మెజారిటీ ఉండటంతో మిత్రపక్షాల నుంచి వ్యక్తమైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడానికి మూడు నల్ల చట్టాలు తెచ్చిందనే విమర్శలున్నాయి. దానికి వ్యతిరేకంగా రైతులు ఏడాది పాటు పోరాటం చేయడంతో అనివార్యంగా దిగి వచ్చి వాటిని వెనక్కి తీసుకున్నది .

కేంద్ర క్యాబినెట్‌పై శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్‌)లు అసంతృప్తితో ఉన్నాయి శిండే వర్గం తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు అంటే, కేబినెట్‌ హోదా కాకుండా స్వతంత్ర మంత్రిత్వ శాఖ ఇస్తే అంగీకరించేది లేదంటున్నది. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్‌), కూటమి తేలిపోయింది. ఫలితాల అనంతరం కూటమిపై కాషాయపార్టీ వైఖరి మారింది. ఓటమికి బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పదవీ నుంచి తనను తప్పించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరగా... కొనసాగాలని అమిత్‌ షా సూచించారు. ఇదందా ఆపార్టీ వ్యూహంలో భాగమే. ఎందుకంటే ఆర్ఎస్‌ఎస్ పత్రిక ఆర్గనైజర్‌లో బీజేపీ, శివసేనలకు అసెంబ్లీలో సంఖ్యా బలం ఉన్నా ఎన్సీపీని చీల్చి అజిత్‌ పవార్‌ను చేర్చుకోవడాన్ని తప్పుపట్టింది. ఎన్నికల సమయంలో ప్రధాని శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్‌)లే అసలైనవని, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ) నకిలీవని అన్నారు. రానున్న రోజుల్లో అసలైన ఈ పార్టీలతో కలిసి పనిచేయాల్సి ఉంటుందన్నారు. కానీ మహా ఓటర్లు అసలైన ఎన్సీపీ, శివసేన ఏవో తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. ఈ ఫలితాలు కమలనాథులకు షాక్ ఇచ్చాయి. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను కలుపుకుని పోయినా సొంతంగానే మెజారిటీ సాధించాలనుకుంటున్నది. అప్పటికి శివసేన (శిండే) పార్టీని బీజేపీలో విలీనం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు. ఇలా మెజారిటీ మార్క్‌కు తక్కువగా ఉన్న 32 సీట్లను ఇతర పార్టీల ఎంపీలను తమవైపు తిప్పుకోవడం లేదా.. వారిని చేర్చుకొనే ప్రయత్నాల ద్వారా చేయవచ్చు. అప్పుడు టీడీపీ, జేడీయూలకు కూడా చెక్‌పెట్టవచ్చన్నది కాషాయ అగ్రనేత ఆలోచన. పదేళ్ల కాలంలో మోడీ నేతృత్వంలోని కేంద్రం పది రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చిందనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి అలాంటి ప్రయత్నాలకు తాత్కాలికంగా ఫుల్‌స్టాప్‌ పెట్టినా.. తాను బలపడిన తర్వాత భాగస్వామ్యపక్షాలను, ప్రాంతీయపార్టీలను బలిచేయడం ఆపార్టీకి కొత్తకాదు అని అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

Raju

Raju

Writer
    Next Story