కాంగ్రెస్ లోని వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా

రైల్వేలో ఉద్యోగాలకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి

కాంగ్రెస్ లోని వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియా
X

ప్రముఖ రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పూనియా శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంతకు ముందు ఇండియన్‌ రైల్వేస్‌ తమ ఉద్యోగాలకు వారిద్దరు రాజీనామా చేశారు. ఏఐసీసీ జనరల్‌ కేసీ వేణుగోపాల్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీతో వీరిద్దరు భేటీ అయ్యారు. అదే సమావేశంలో కాంగ్రెస్‌ లో చేరికపై నిర్ణయం తీసుకున్నారు. త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ రెజ్లర్లు కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలోకి దిగబోతున్నారు. పార్టీలో చేరిన అనంతరం కేసీ వేణుగోపాల్‌, పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా, హర్యానా కాంగ్రెస్‌ చీఫ్‌ ఉదయ్‌ భాన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపక్‌ బాబ్రియాతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో చేరడానికి ముందు ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.



రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌భూషణ్‌ ను తప్పించాలని వినేశ్‌ ఫోగట్‌ సహా ప్రముఖ రెజ్లర్లు రోజుల తరబడి ఢిల్లీ వీధుల్లో ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆమెపై కక్షకట్టింది. పారిస్‌ ఒలింపిక్స్‌ లో ఆమె రెగ్యులర్‌ కేటగిరి 53 కేజీల విభాగంలో కాకుండా 50 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సి వచ్చింది. 50 కేజీల విభాగంలో ఫైనల్స్‌ కు చేరినా నిర్దేశిత బరువు కన్నా వంద గ్రాములు ఎక్కువగా ఉందని ఆమెను డిస్‌ క్వాలిఫై చేశారు. దీంతో ఆమె ఒలింపిక్స్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2019 హర్యాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్‌ సోదరి బబిత బీజేపీలో చేరి దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నెంచే బబితకు టికెట్‌ ఇచ్చే యోచనలో బీజేపీ ఉంది.. అదే స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వినేశ్‌ కు టికెట్‌ ఇవ్వాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. రెండు పార్టీలు అక్కాచెల్లెళ్లకు టికెట్లిస్తే ఫోగట్‌ సిస్టర్స్‌ పోటీ దేశంలోనే ఆసక్తి రేకెత్తించనుంది. అక్టోబర్‌ 5న హర్యాణ అసెంబ్లీకి పోలింగ్‌ జరగనుంది.. 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు.

Next Story