వివిధ శాఖల మంత్రుల సమీక్షలు.. అధికారులకు దిశానిర్దేశం

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, సీతక్కలు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు.

వివిధ శాఖల మంత్రుల సమీక్షలు.. అధికారులకు దిశానిర్దేశం
X

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించిన పలు నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌, సీతక్కలు వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టాలని మంత్రి రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. వానకాలంలో సీజనల్‌ వ్యాధుల చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఫుడ్‌ సేఫ్టీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ వైద్య కార్పొరేషన్‌ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. నకిలీ మందులు లేకుండా నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. నాణ్యమైన మందులు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. హోటళ్లు, హాస్టళ్లు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిందేనని, ఈ విషయంలో రాజీ పడవద్దని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.


ఎకో టూరిజం అభివృద్ధిపై మంత్రి కొండా సమీక్ష

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తున్నదని అటవీ శాఖ మంత్రి కొండా సరేఖ తెలిపారు. సెక్రటేరియట్‌లో ఎకోటూరిజంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి మార్చిలో ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలు చేసింది. ఒడిషా తదితర అధ్యయనం చేసిన అధికారులు అక్కడి పరిస్థితులను మంత్రికి వివరించారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని అత్యుత్తమ ఎకో టూరిజం పాలసీని తయారు చేయాలని మంత్రి చెప్పారు. ప్లాస్టిక్‌ర హిత పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మంత్రి తెలిపారు. ఎకో టూరిజంపై సీఎంతో చర్చించి త్వరలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.


గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న పొన్నం

సిద్దిపేట సమీకృత కలెక్టరేట్‌ భవనంలో బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్‌ జిల్లా కలెక్టర్‌ ఎం మనో చౌదరితో కలిసి గౌరవెల్లి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నిర్మాణంపై రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణం 95 శాతం పూర్తయినందున ఆ ప్రాజెక్టు ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చడానికి పంట పొలాలకు సాగునీరు సరఫరా చేయడానికి అవసరమైన డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌ నిర్మాణాలకు భూమి సర్వే, మార్కింగ్‌ను జులై 10 వతేదీలో పూర్తి చేయాలన్నారు. మళ్లీ జులై 11న సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. మెయిన్‌ కెనాల్‌ వస్తే రైతులకు నమ్మకం పెరిగి డిస్ట్రిబ్యూటరీ త్వరగా పూర్తికావడానికి సహకరిస్తారని మంత్రి తెలిపారు. సిద్దిపేట సహా హుస్నాబాద్‌ మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.


అన్నిరకాల మాఫీయాను సంపూర్ణంగా నిర్మూలిస్తామన్న సీతక్క

రాష్ట్రంలోయువత డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని అన్నిరకాల మాఫీయాను సంపూర్ణంగా నిర్మూలిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్‌ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గంజాయిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడుతామన్నారు.

Raju

Raju

Writer
    Next Story