రాహుల్ గాంధీతో రేవంత్ కు అనే విభేదాలున్నయ్

అదానీ పెట్టుబడుల విషయంలో పార్టీ హైకమాండ్ తీరుకు భిన్నంగా రేవంత్ తీరు : మీడియా చిట్ చాట్ లో కేటీఆర్​

రాహుల్ గాంధీతో రేవంత్ కు అనే విభేదాలున్నయ్
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డికి అనేక విభేదాలున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం చేవెళ్లలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. అదానీ వ్యపారాలపై కాంగ్రెస్ హైకామండ్, రాహుల్ గాంధీ తీరుతో రేవంత్ విభేదిస్తున్నారని తెలిపారు. అదానీ కంపెనీపై హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్టుపై సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. పదేళ్లుగా తమ మెడపై కత్తి పెట్టినా అదానీని రాష్ట్రంలోకి అడుగు పెట్టనివ్వలేదన్నారు. కాంగ్రస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, తెలంగాణలోనే రేవంత్ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేలా అదానీతో రేవంత్ ఎంవోయూలు చేసుకున్నారని అన్నారు. అదానీ వ్యాపారాలు అక్రమమా.. సక్రమమా అనేది రేవంత్, రాహుల్ కలిసి కూర్చొని తేల్చుకోవాలన్నారు.

తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అన్నారు. అద్భుతంగా నిర్మించిన సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అన్నారు. అక్కడ రాహుల్ గాంధీ అయ్య విగ్రహం పెట్టి ఆయన దగ్గర మార్కులు కొట్టేయాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి రేవంత్ కు ఉన్న సమస్య ఏమిటని ప్రశ్నించారు. అంజయ్యను అవమానించిన రాజీవ్ గాంధీ విగ్రహం ఆయన పార్క్ ఎదురుగా పెట్టడంలో ఆంతర్యమేమిటో చెప్పాలన్నారు. గాం ధీ విగ్రహాన్ని గాడ్సే ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి లాంటి ద్రోహులు ఏర్పాటు చేయిస్తే అంతే దారుణంగా ఉంటుందన్నారు. పదేళ్ల కింద కొత్త సెక్రటేరియట్కట్టలేదన్న విషయం తెలివి తక్కువ రేవంత్ రెడ్డికి తెలియడం లేదన్నారు. సెక్రటేరియట్ ప్రారంభించిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ప్రకటించామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇదే అహంకారంతో మాట్లాడితే, తాము అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి పథకం పేరును కచ్చితంగా మారుస్తామని హెచ్చరించారు.

రాష్ట్ర అప్పులపై రేవంత్ రెడ్డి సర్కార్ అసత్యాలు, దుష్ప్రచారాలు చేస్తోందన్నారు. జీతభత్యాలు లాంటి కచ్చితమైన ఖర్చులు పోను రాష్ట్రం రెవెన్యూ సర్ ప్లస్ స్టేట్ గా ఉందన్నారు. 2014 లో రూ.300 కోట్లు రెవెన్యూ మిగులు ఉంటే 2023 లో రూ. 5,900 కోట్ల రెవెన్యూ మిగులుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి, మంత్రులకు పాలన చేతగాక ఆ తప్పులను గత బీఆర్ఎస్ పై నెట్టేయాలని చూస్తున్నారని అన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని అన్నారు. రుణమాఫీపై అబద్ధాలు ఆడినందుకు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. రైతులందరి రుణాలు ఎప్పట్లోగా మాఫీ చేస్తారు.. రైతుభరోసా సాయం ఎప్పుడు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారో సమాధానం ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బానిసలు అన్నారు. తొమ్మిది నెలల పాలనలో రేవంత్ చేసిన అద్భుతం ఏదైనా ఉంది అంటే 20 సార్లు ఢిల్లీకి పోవడమేనని తెలిపారు.

కేసీఆర్ గుర్తులను తుడిపి వేయాలి చూస్తే తెలంగాణ ఉండదన్నారు. తెలంగాణ లేకుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ఏమన్నాకుట్ర చేస్తున్నాడేమో చూడాలి అన్నారు. తెలంగాణ అనే పేరు ఏమైనా మారుస్తాడేమో చూడాలన్నారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు అభిషేక్ సింఘ్వీని పంపుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఒక్కో పదవిని రాష్ట్రేతరులకు కట్టబెడుతోందని అన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని అన్నారు. సింఘ్వీ తెలంగాణ కోసం కొట్లాడుతారు అని సీఎం అంటున్నారని, మరిఇక్కడి నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు గాడిదలు కాస్తారా అని ప్రశ్నించారు. మాదిగలకు రాజ్యసభ స్థానం ఇస్తామని చెప్పి మోసం చేసి అభిషేక్ సింఘ్వీకి ఇచ్చారన్నారు. రుణమాఫీ త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయకుండా కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని తాను అనుకోవడం లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని.. అది తేల్చకుండా ఎన్నికలు ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ కు లేదన్నారు. ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందన్నారు. ఆరు గ్యారంటీలతో హామీలన్నీ అమలు చేయాలని పోరాడుతామన్నారు. హామీలు అమలు చేయలేక రేవంత్ అడ్డగోలుగా మాట్లాడుతంటే మంత్రులు ఇరుక్కుపోతున్నారని అన్నారు. రైతుబంధు పేరుతో ఎగవేసిన రూ.7,500 కోట్లనే ఇప్పటి వరకు రుణమాఫీగా రైతులకు చెల్లించారని, అంతుకుమించి పైసా రైతులకు చేరలేదన్నారు.

Next Story