వయనాడ్‌ బరిలో ప్రియాంక?

కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సుదీర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నా ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ నిలువలేదు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడనున్నారని తెలుస్తోంది

వయనాడ్‌ బరిలో ప్రియాంక?
X

కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సుదీర్ఘకాలం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ నిలువలేదు. ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో నిలబడనున్నారని కాంగ్రెస్‌ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఆమె వాయనాడ్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్‌, యూపీలోని రాయ్‌బరేలీ లో పోటీ చేశారు. పోటీ చేసిన రెండు చోట్లా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇప్పుడు ఈ రెండు చోట్లలో ఏదో స్థానాన్ని వదులుకోక తప్పని పరిస్థితి నెలకొన్నది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానని రాహుల్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. యూపీలో పార్టీ బలోపేతం కోసం రాహుల్‌ కృషి చేయాలనుకుంటున్నారని, అందుకే రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగి, వయనాడ్‌ స్థానాన్ని వదులుకోవచ్చని తెలుస్తోంది. 'దేశానికి నాయకత్వం రాహుల్‌ గాంధీ వయనాడ్‌కే పరిమితం కావాలని మేము అనుకోవడం లేదని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా బాధపడమన్నారు. ఆయన నిర్ణయాన్ని అర్థం చేసుకోగలం. ఆయనకు ఎప్పటికీ అండగా ఉంటామన్న'కేరళ పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌ మాటలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

రాహుల్‌ గాంధీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన వయనాడ్‌ స్థానాన్ని వదులుకుంటే ఖాళీ అయ్యే ఈ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ మొదలైంది. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ ఉప ఎన్నిక లో బరిలోకి నిలిచి ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రం చేయనున్నారని సమాచారం. మొన్నటి ఎన్నికల్లోనే ప్రియాంక అమేథీ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. యూపీలో కాంగ్రెస్‌ పార్టీ 17 చోట్ల పోటీ చేసినా రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఎవరు పోటీచేస్తారనే అంశంపై చివరి దాకా సస్పెన్స్‌ కొనసాగించింది. ఈ రెండు చోట్లా ప్రియాంక పేరే ఎక్కువగా వినిపించింది. చివరికి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీని నిలిపింది. అమేథీలో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్‌ శర్మను బరిలోకి దించింది. ఈ రెండు స్థానాలను కాంగ్రెస్‌ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

రాహుల్‌గాంధీ వాయనాడ్‌ స్థానానికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ప్రియాంకను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆపార్టీ అధిష్ఠానం ఆలోచన. దీంతో పాటు గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాదిలో చాలా సీట్లను కోల్పోయింది. దక్షిణాదిలో ఆ పార్టీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడంతో 240 సీట్లైనా దక్కించుకున్నది. దీంతో ప్రియాంక కేరళ నుంచి బరిలోకి దింపితే భవిష్యత్తులో దక్షిణాదిలో పార్టీకి కొంత బలం చేకూరుతుంది అనుకుంటున్నది.

Raju

Raju

Writer
    Next Story