ఓహో మీరేనా నన్ను ఓడించింది.. కంగ్రాట్స్‌

ఒడిషా మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపారు. ఓడించిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా అభినందించిన ఆయన తీరుకు ప్రజాప్రతిధులే కాదు ప్రజలు ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు.

ఓహో మీరేనా నన్ను ఓడించింది.. కంగ్రాట్స్‌
X

ఒడిషా ముఖ్యమంత్రిగా 24 ఏళ్లు పాలించిన నవీన్‌ పట్నాయక్‌ వ్యక్తిత్వం, ఆయన హుందా రాజకీయాలపై ఎవరికీ భిన్నాభిప్రాయాలు ఉండవు. మృదస్వభావి అయిన ఆయన గెలుపోటములను సమానంగానే స్వీకరిస్తారు. దీనికి నిదర్శనమే ఆ రాష్ట్ర సీఎం మోహన్‌ మాఝి ప్రమాణ స్వీకారానికి హాజరై అక్కడ వేదికపై ఉన్న కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో కలిసిపోయారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఆ సందర్భం ద్వారా చాటిచెప్పారు. మంగళవారం సభలోనూ నవీన్‌ పట్నాయ్‌ తన ఉన్నత వ్యక్తిత్వాన్ని మరోసారి చాటారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు స్థానాల్లో (హింజలి, కంటాబంజి) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌ బాగ్‌ చేతిలో ఓడిపోయారు. ఎమెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వచ్చారు. అనంతరం అందరినీ పలకరిస్తూ వెళ్తుండగా సభలో కూర్చున్న లక్ష్మన్ బాగ్‌ నవీన్‌ పట్నాయక్‌ చూడగానే లేచి నమస్కారం పెట్టి పరిచయం చేసుకున్నారు. దీనికి స్పందించిన నవీన్‌ పట్నాయక్‌ 'ఓహో మీరేనా నన్ను ఓడించింది. మీకు అభినందనలు' అన్నారు. దీంతో అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మాఝి, మంత్రులు, ఎమ్మెల్యేలు చిరునవ్వులు చిందించారు. ఓడించిన అభ్యర్థిని మనస్ఫూర్తిగా అభినందించిన తీరుకు ప్రజాప్రతిధులే కాదు ప్రజలు ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు. ఇలాంటి ఆరోగ్యకమైన రాజకీయ వాతావరణం అన్నిచోట్లా ఉండాలని నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బిజు జనతాదళ్‌ పార్టీ ఓడిపోయి బీజేఈ అధికారంలోకి వచ్చింది. గత ఎన్నికల్లో 112 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 51 స్థానాలకే పరిమితమైపోయింది. బీజేపీ 78 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ 24 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ పాలనకు ఫుల్‌స్టాప్‌ పెట్టింది.

Raju

Raju

Writer
    Next Story