''నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన''కు అనే రోజులు మళ్లీ వచ్చాయ్‌

కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వ వైద్యం పడకేసింది : మాజీ మంత్రి హరీశ్‌ రావు

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయ్‌
X

నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులు మళ్లీ వచ్చాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని 'ఎక్స్‌' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చామని.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు అనేక విప్లవాత్మకమైన పథకాలు ప్రవేశపెట్టామన్నారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మన హాస్పిటళ్లు సాధించిన ఘనతను చాటేలా పత్రికల్లో వార్తలు వచ్చేవని.. కాంగ్రెస్‌ పాలనలో సర్కారు ఆస్పత్రుల్లోని అధ్వాన పరిస్థితులపై రోజూ వార్తలు వస్తున్నాయని అన్నారు. "పడకేసిన ప్రజారోగ్యం.. రోగుల మందులు ఎలుకల పాలు.. కుర్చీలోనే గర్భిణీ డెలివరీ.. ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్మెంట్" ... ఇవన్నీ ఈ ఒక్క రోజు పత్రికల్లో వైద్య ఆరోగ్యశాఖపై నిర్వాకంపై వచ్చిన వార్తా కథనాలని తెలిపారు. వర్షాకాలంలో పారిశుధ్య నిర్వహణను పట్టించుకోకపోవడంతో మలేరియా, డెంగీలాంటి సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయని.. పల్లెపట్టణం తేడా లేకుండా వైరల్‌ ఫీవర్లతో ప్రతి ఇద్దరిలో ఒకరు బాధ పడుతున్నారని తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలిన ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. గడిచిన 45 రోజుల్లోనే 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయని, నిరుటితో పోల్చితే 36 శాతం అదనంగా డెంగీ సోకిందని తెలిపారు. ఒక్క రోజే డెంగీతో ఐదుగురు మృత్యువాత పడ్డారని.. పరిస్థితి ఇంత అధ్వనంగా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ మరణాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మార్పు రావాలంటే కాంగ్రెస్‌ రావాలని ఊదరగొట్టినోళ్లు ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకుంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజారోగ్య వ్యవస్థను గాడిలో పెట్టాలని కోరారు.

Next Story