రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ.. దగా..నయవంచన : కేటీఆర్

చారాణ రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం బారాణా ప్రచారం చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

KTR
X

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పేరిట.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందల్లా.. దగా.. నయవంచన అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రైతులందరికీ రుణమాఫీ అని ఆశచూపారని, పరుగు పరుగున వెళ్లి రూ.2 లక్షలు రుణం తెచ్చుకోమన్న సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని కేటీఆర్ గుర్తు చేశారు. డిసెంబర్ 9న ఏకకాలంలో మొత్తం రుణం మాఫీ చేస్తామన్ననీ, తీరా అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు దాటాక, కోటి ఆంక్షలు, శతకోటి షరతులతో లక్షలాది మంది రైతులను నిండా ముంచేసారన్నారు.ఈరోజు చేసిన రుణమాఫీ తీరుతో “కాంగ్రెస్ అంటేనే మొండిచెయ్యి” అని మరోసారి రుజువుచేశారన్నారు. రుణమాఫీ పేరుతో నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రిని, తెలంగాణ రైతులు ఎప్పటికీ “మాఫ్” చెయ్యరనీ,రుణమాఫీ కాని అన్నదాత.. రేపటి నుంచి రోడ్డెక్కడం ఖాయంమని, రైతులను నిండాముంచిన రేవంత్ సర్కార్‌‌ను ప్రజలు నిలదీయడం తథ్యమన్నారు.

బిఆర్ఎస్ పాలనలో రూ.లక్ష రుణమాఫీకే రూ.17వేల కోట్లు ఖర్చు అయ్యాయని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో.. రూ.2 లక్షల రుణమాఫీ 17 వేల 900 కోట్లతోనే ఎలా సాధ్యం అయ్యిందో రాష్ట్ర రైతాంగానికి వివరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికీ.. మిలియన్ డాలర్ జోక్ అన్న కేటీఆర్, వరికి బోనస్ పథకంలానే.. రుణమాఫీ కూడా బోగస్ అని విమర్శించారు. రుణ మాఫీ మొత్తం రెట్టింపు అయినప్పుడు.. లబ్దిదారుల సంఖ్య పెరగాల్సిందిపోయి తగ్గడం.. మీ మోసపూరిత విధానానికి నిలువెత్తు నిదర్శనం అన్నారు.ఈరోజు చెప్పిన రుణమాఫీతో సగానికి సగం మంది రైతులను అనర్హులను చేస్తారా ? ఇంతకన్నా దారుణం.. దుర్మార్గం ఉంటుందా... ?? అని మండిపడ్డారు.

ఇవాళ కుంటిసాకులతో రైతులను రుణమాఫీకి దూరం చేస్తే... రేపు అన్నదాతలు మిమ్మల్ని పరిపాలనకు అనర్హులుగా ప్రకటిస్తారనీ హెచ్చరించారు. ఇప్పటికే వర్షాకాలం సగం సీజన్ అయిపోయినా.. రైతుబంధుకు దిక్కులేదు.. మీరిస్తానన్న రైతుభరోసా ఊసేలేదనీ గుర్తుచేసిన కేటీఆర్, రైతుబంధు నిధులనే రుణమాఫీకి మళ్లించి.. మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ కపట నాటకం.. చైతన్యవంతులైన అన్నదాతలకు అర్థమైపోయిందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి.. రైతులను రూ.2 లక్షల రుణమాఫీ పేరిట మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతన్నలతో కలిసి తెలంగాణ ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story