హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ నేతలు దందా చేస్తున్నరు

బిల్డర్ల నుంచి స్క్వేర్‌ ఫీట్‌ కు రూ.100 వసూలు చేస్తున్నరు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద

హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ నేతలు దందా చేస్తున్నరు
X

హైడ్రా పేరుతో కాంగ్రెస్‌ నాయకులు దందా చేస్తున్నారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు హైడ్రాకు చట్టబద్ధతే లేదన్నారు. హైదరాబాద్‌ లో ఎన్ని చెరువులు ఉన్నాయి.. వాటి ఎఫ్‌ టీఎల్‌, బఫర్‌ జోన్లలో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయో కనీసం తెలుసా అని ప్రశ్నించారు. సీఎం అన్న ఇంటికి నోటీసులు ఇచ్చి పేదల ఇండ్లు కూలగొడుతారా అని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రాకు చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ లో చెరువులను ఆక్రమించింది కాంగ్రెస్‌ నాయకులేనని తెలిపారు. రియల్‌ ఎస్టేట్‌ కోసమే ఫోర్త్‌ సిటీ జపం చేస్తున్నారని తెలిపారు. బిల్డర్ల నుంచి ఒక్కో స్క్వేర్‌ ఫీట్‌ కు రూ.100 కమీషన్ల రూపంలో వసూలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ లీడర్ల దందాలన్నీ బయట పెడతామన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వంగా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలిచిందన్నారు.

కేసీఆర్ ను తిట్టడానికి సీఎం, మంత్రులు పరిమితం అయ్యారన్నారు. సీఎం రేవంత్‌ అత్యంత దిగజారి మాట్లాడుతున్నారని, సీఎం హోదాను అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం భాషపై సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. సీఎం తన భాషను డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులకు నేర్పిస్తున్నారని అన్నారు. గురుకులాల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, రాష్ట్రంలో విపత్తులు వస్తే ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళికలు ప్రభుత్వం దగ్గర లేవన్నారు. తొమ్మిది నెలలకే రేవంత్‌ పాలనపై ప్రజలు విసుగు చెందారని, కేసీఆర్‌ పాలనను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు విష జ్వరాలతో బాధ పడుతున్నా పట్టించుకునే వారే లేరన్నారు. కేసీఆర్‌ ప్రజల్లోకి వస్తారని తెలిస్తేనే ప్రభుత్వం భయపడుతోందని.. అందుకే మంత్రులతో తిట్టిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చిందే కేసీఆర్ వల్ల అనే విషయం మర్చిపోవద్దన్నారు. ఒక్క హామీని కాంగ్రెస్‌ నెరవేర్చలేదని, ప్రజలంతా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. సోనియా, రాహుల్‌, ప్రియాంకాగాంధీ స్వయంగా ఇచ్చిన హామీలకు దిక్కులేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా పీసీసీ చీఫ్‌, మంత్రి పదవులు కూడా రేవంత్‌ భర్తీ చేయించలేకపోయారని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ దేశంలోనే అత్యంత మోసం అన్నారు.

కేసీఆర్‌ గురించి మాట్లాడే హక్కు లేదు : సత్యవతి రాథోడ్‌

కేసీఆర్‌ గురించి మాట్లాడే హక్కు సీఎం, మంత్రులకు లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. కేసీఆర్‌ కొట్లాడి తెలంగాణ సాధిస్తేనే రేవంత్‌ సీఎం, తాను డిప్యూటీ సీఎం అయ్యానన్న విషయం భట్టి గుర్తు పెట్టుకోవాలన్నారు. భట్టి మనస్తాపం చెందిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతారని అన్నారు. కేసీఆర్‌ ఎందుకు ప్రజల్లోకి రాకూడదో భట్టి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా సీఎం, మంత్రులకు కనీసం సోయి లేదన్నారు. నలుగురు మంత్రులు కలిసి ఇప్పటి వరకు వర్షాలపై రివ్యూ చేయలేదన్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పై మాట్లాడితే రేవంత్‌ రెడ్డికి సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిందన్నారు. రాష్ట్రంలో వర్షాలపై సీఎం ఇప్పటికైనా రివ్యూ చేయాలన్నారు.

Next Story