ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం 'సరిపోద శనివారం' సినిమా చూసిండు

బీఆర్ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌

ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం సరిపోద శనివారం సినిమా చూసిండు
X

రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం రేవంత్‌ రెడ్డి పట్టించుకోకుండా తన ఇంట్లో 'సరిపోద శనివారం' సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేశారని బీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ఆరోపించారు. మంగళవారం మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు దాసోజు శ్రవణ్‌, మన్నె గోవర్ధన్‌ రెడ్డి, పల్లె రవికుమార్‌ గౌడ్‌ తో కలిసి తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తోందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ నాయకుల పర్యటనకు వచ్చిన స్పందన చూసి రేవంత్‌ రెడ్డికి వణుకు పుట్టిందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు వెళ్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఆగస్టు 27న రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని, అయినా సీఎం ఒక్క రివ్యూ కూడా పెట్టలేదన్నారు. ప్రజలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతుంటే కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూస్తూ రేవంత్‌ ఎంజాయ్‌ చేశారని అన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా ఒక్క హెలీ క్యాప్టర్‌ తెప్పించలేకపోయారని, తమ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. కేసీఆర్‌ పాలనలో వరదలు, తుఫాన్లు వస్తే ముందే అన్ని సిద్దం చేసేవారని, కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలను ఆదుకునే వారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలోకి రావాలని రేవంత్‌ అంటున్నారని, వెళ్తే కాంగ్రెస్‌ నేతలు కర్రలు, రాళ్లతో దాడులు చేస్తున్నారని అన్నారు. తెలంగాణను బిహార్‌ లాగా మార్చాలని రేవంత్‌ కంకణం కట్టుకున్నారని, అందుకే రావణ కాష్టంలా మార్చుతున్నారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్‌ నాయకులపై దాడి జరిగిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Next Story