వరదలకు కొట్టుకుపోతననే సీఎం బయటకు రాలేదా

ఖమ్మం ప్రజలు సాయం కోసం 9 గంటలు ఎదురు చూసినా పట్టించుకోలే : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

వరదలకు కొట్టుకుపోతననే సీఎం బయటకు రాలేదా
X

వరదలకు కొట్టుకుపోతాననే సీఎం రేవంత్‌ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు రాలేదా అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వర్షాలపై సీఎస్‌ హెచ్చరిక ఫాలో అయి సీఎం, మంత్రులు బయటకు రాకుండా ఉన్నారా అని మండిపడ్డారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌ రెడ్డి, పార్టీ నాయకుడు గట్టు రామచందర్‌ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం ప్రజలు సహాయం కోసం 9 గంటలు ఎదురు చూసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఒక మంత్రి హెలీక్యాప్టర్‌ కోసం ఏపీ సీఎంతో మాట్లాడానని అంటున్నారని, ఆయన తెలంగాణ సీఎంతో హెలీక్యాప్టర్‌ కోసం ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. తాము ప్రయత్నం చేసినా హెలీ క్యాప్టర్‌ రాలేదని ఇంకో మంత్రి చెప్తున్నారని, మంత్రిగా ఫెయిల్యూర్‌ అయ్యారు కాబట్టి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. విపత్తు వేళ రాష్ట్రానికి హెలీక్యాప్టర్లు తెప్పించకుండా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షాతో మాట్లాడి సీఎం రేవంత్‌ రెడ్డితో ఎందుకు హెలీక్యాప్టర్లు తెప్పించలేదో ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. తమకు పాలన చేతకావడం లేదని మంత్రులు అంటున్నారని, ఈ ప్రభుత్వానికి పాలించే నైతిక హక్కు లేదన్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్లాలన్నా హెలీక్యాప్టర్‌ దొరుకుతుంది కానీ వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు దొరకదా అని ప్రశ్నించారు.

ఖమ్మంలో వరదలపై బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన వ్యాఖ్యల్లో రాజకీయంగా ఒక్క పదమైనా కనిపించిందా.. ఎందుకు మంత్రులు రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు గత ఈతగాళ్లకు డబ్బులు ఇచ్చి తమ ప్రాణాలను రక్షించుకున్నారని, వాళ్లను వాళ్లే రెస్క్యూ చేయించుకున్నారు తప్ప ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని.. గంటల తరబడి ప్రజలు సాయం కోసం ఎదురు చూసినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడలేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే ఇంతటి విపత్తు సంభవించిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేకపోయిందన్నారు. ప్రభుత్వం ముందే ప్రజలను హెచ్చరించి ఉంటే వాళ్లు బయటకు వచ్చి ఆపదలో చిక్కుకునే వారు కాదన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రజలే నిలదీస్తున్నారని గుర్తు చేశారు. నిన్న జరిగిన అన్ని సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. వరదలతో ఒక సైంటిస్ట్‌ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇకనైనా అప్రత్తంగా ఉంటూ ప్రజల మధ్యనే ఉండాలన్నారు. కోదాడలో ఎవరి హయాంలో కబ్జాలో జరిగాయో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

Next Story