జీవో 46పై అడ్వకేట్‌ జనరల్‌తో అబద్ధాలాడిస్తున్న ప్రభుత్వం : రాకేష్ రెడ్డి

జీవో 46 పై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే ప్లేట్‌ ఫిరాయించారని రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీవో 46పై అడ్వకేట్‌ జనరల్‌తో అబద్ధాలాడిస్తున్న ప్రభుత్వం : రాకేష్ రెడ్డి
X

ఏడాది కాలంగా తమ హక్కుల కోసం కొట్లాడుతున్న జీవో 46 బాధితులకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో వాద ప్రతివాదనకు వచ్చింది. కానీ ప్రభుత్వ తరఫున న్యాయవాది, అడ్వకేట్ జనరల్ కావాలనే కారణాలు చెప్పి వాయిదా వేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి మండిపడ్డారు.

జీవో 46 బాధితులకు ప్రభుత్వం కావాలని అన్యాయం చేస్తున్నదని, బాధితులతో బంతి ఆటాడుతున్నది. అమాయాక యువతను మోసం చేస్తున్నది. ఈ కేసులో 20 సార్లకు పైగా కోర్టులో వాదనలు వాయిదా పడటం ప్రభుత్వ పుణ్యమే అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని, స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డే ప్లేట్‌ ఫిరాయించారని రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దాటవేత ధోరణని అవలంబిస్తూ అడ్వకేట్‌ జనరల్‌తో అబద్ధాలు ఆడిస్తున్నది. ప్రభుత్వం జీవో 46పై స్పష్టమైన వైఖరి చెప్పకపోతే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడుతామని హెచ్చరించారు.

ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉద్దెర మాటలు చెప్పి, నోటికొచ్చిన హామీలు ఇచ్చారు. అధికారంలోకి రాగానే అన్నింటిపై దాటవేసే ధోరణితో వ్యవహరిస్తున్నారు. జీవో 46 పై ప్రభుత్వం వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు దుద్ధిల్ల శ్రీధర బాబు, దామోదర్ రాజనర్సింహ మా నిరసనగకు తలొగ్గి తూతూ మంత్రంగా ప్రెస్ మీట్ పెట్టారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందనలేదని, సీఎం నుంచి దీనిపై ఉలుకు పలుకు లేదన్నారు. సీఎం వైఖరి చూస్తుంటే కమిటీలో ఉన్న ఇద్దరు మంత్రులు కీలు బొమ్మలేనని ఒప్పుకోవాలన్నారు.

కొన్ని వేల కుటుంబాలకు సంబంధించిన అంశాన్నికాంగ్రెస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొన్నది. ఇప్పుడూ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నది. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోర్టులో సహజ న్యాయ ప్రక్రియకు అడ్డుపడకుండా జీవో 46 బాధితులకు న్యాయం చెయ్యడం కోసం కృషి చేయాలన్నారు. జీవో 46 బాధితులకు రక్షణ కవచంగా ఉంటామన్నారు. చట్టసభలు స్పందించకపోతే కోర్టులో కొట్లాడుతామన్నారు. న్యాయం జరిగే వరకూ బాధితుల వెంటే ఉంటామన్నారు.

Raju

Raju

Writer
    Next Story