ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్య : హరీశ్‌రావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతుల ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Harish rao
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతుల ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం రూరల్‌ మండలం జాన్‌పహాడ్‌ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్‌రెడ్డి మృతి బాధాకరమని ఎక్స్‌ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో డిప్యూటీ సీఎంతో సహా రాష్ట్ర కేబినెట్‌లోని ముగ్గురు మంత్రులున్న రైతులకు ఈ దుస్థితి ఉందంటే రాష్ట్రంలో రైతుల తీరు ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను తీర్చేందుకు ఏలాంటి సహాయం చేయకపోగా వారిని కొత్త సమస్యల్లోకి నెట్టివేస్తున్నదన్నారు.

పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంకట్‌రెడ్డి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు. ఇటీవలే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో జరిగిన రైతు ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో రైతు మరణించడం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. రైతులు అధైర్యపడవద్దని.. ఏమైనా సమస్యలుంటే పోరాడి పరిష్కరించుకుందామని తెలిపారు. చావు సమస్య పరిష్కారానికి మార్గం కాదని హరీశ్‌రావు భరోసా కల్పించారు

Vamshi

Vamshi

Writer
    Next Story