ఎమ్మెల్యే సంజయ్‌పై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఫైర్..జీవన్ రెడ్డి మనస్తాపం

తనకు తెలియకుండానే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. ఈ నేపథ్యంలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది

Mla sanja
X

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అన్ని విధాల లబ్ధిపొంది ఎమ్మెల్యేగా గెలిచాక వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సంజయ్‌ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని సంజయ్‌మోసం చేశారని. కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ని జగిత్యాలలో తిరుగని వ్వమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌హెచ్చరించారు. సంజయ్‌ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే సంజయ్‌ ఇంటిని ముట్టడించాయి.

జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దిష్టి బొమ్మలను తగులబెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.ఈశ్వర్‌ మాట్లాడుతూ.. ఉద్యమంలో పాల్గొనకున్నా ఆయనకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ పిలిచి మరీ టికెట్‌ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత చంటిపిల్లాడిలా అతడిని ఊరూరు తిప్పి ఎమ్మెల్యేగా గెలిపించారు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేసి జగిత్యాల ప్రజలను సంజయ్‌ మోసం చేశాడని మండిపడ్డారు. రూ.40 కోట్లు తీసుకొని కాంగ్రెస్‌లో చేరాడని ఆరోపించారు. అధికారం కోల్పోగానే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కడియం శ్రీహరి పార్టీని వీడటం దారుణమన్నారు.

మరోవైపు తనకు తెలియకుండానే ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేర్చుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. నిన్న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో సంజయ్ హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో జీవన్ రెడ్డి తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారని తెలుస్తోంది. తన ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.2014 నుంచి జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ జగిత్యాల నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2018, 2023లలో జీవన్ రెడ్డిపై సంజయ్ కుమార్ విజయం సాధించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story