కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ.. గోదావరి నది ప్రాజెక్టులపై లేదు : గుత్తా సుఖేందర్ రెడ్డి

కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు

Gutha
X

నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమీపంలోని సుంకిశాల ప్రాజెక్టు ను తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు సందర్శించారు .నాగార్జున సాగర్ వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో కూలిపోయిన సుంకిశాల సైడ్ వాల్ ప్రదేశాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. సుంకిశాల ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభించారో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌కే తెలియాలి అన్నారు. ఇది కేసీఆర్ మానస పుత్రికనో.. కేటీఆర్ మానస పుత్రికనో తెలియడం లేదని పరోక్షంగా విమర్శలు చేశారు.

కృష్ణా బేసిన్‌లోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ పాలకులు నిర్లక్ష్యం చేశారని, దీంతో నల్గొండ జిల్లాకు అన్యాయం చేశారని విమర్శించారు. గోదావరి నదిపైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధ, కృష్ణా బేసిన్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపలేదని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసి, జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్, భారీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు సూచించారు. అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

Vamshi

Vamshi

Writer
    Next Story