తెలంగాణలో మహిళలకు భద్రత కరువు

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

తెలంగాణలో మహిళలకు భద్రత కరువు
X

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మహిళలకు భద్రత కరువయిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైన ఘటన జరగగానే ప్రకటనలు గుప్పించే కాంగ్రెస్‌ ముఖ్యనేత రాహుల్‌ గాంధీకి తెలంగాణలో మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్‌ గాంధీపై ఫైర్‌ అయ్యారు. కొమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరులో అత్యంత అమానవీయంగా ఆదివాసీ మహిళలపై అత్యాచారయత్నం, హత్యాయత్నం చేసినా ఎందుకు స్పందన లేదని ప్రశ్నించారు. మైనార్టీ సంతుష్టీకరణ విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌ గాంధీకి ఆదివాసీ మహిళలపై అఘాయిత్యం కనిపించడం లేదా అన్నారు. కోల్‌ కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం, జైనూరులో ఆదివాసీ మహిళపై అఘాయిత్యాలను కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా దాచి పెట్టే ప్రయత్నం చేసిందన్నారు. మహిళలపై అఘాయిత్యాలను ఖండించాల్సింది పోయి సెలక్టివ్‌గా, ఉద్దేశ పూర్వకంగా మాత్రమే మాట్లాడటం మానుకోవాలన్నారు.

తెలంగాణలో మూడు నెలల్లో మహిళలపై జరిగిన అఘాయిత్యాలను తాను రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తున్నానని అన్నారు. జూన్ 13న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని రైస్ మిల్లులో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్‌ 24న నాగర్‌కర్నూల్ జిల్లాలో గిరిజన మహిళను వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశారని, జూలై 21న నాగర్‌ కర్నూల్ జిల్లా హాజీపూర్‌లో ఇద్దరు మహిళా కూలీలపై షాపు యజమానులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. జూలై 24న మలక్‌పేట అంధుల పాఠశాలలో 8 ఏళ్ల బాలికపై దాడి చేశారని, 30న వనస్థలిపురంలో 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఆగస్టు 24 షాద్‌ నగర్‌ కు చెందిన దళిత మహిళ సునీతపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని వివరించారు. అదే రోజు సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్‌ మద్దతుదారులు దాడి చేశారని తెలిపారు. ఇవి కేవలం ఇటీవల జరిగిన దారుణాలు మాత్రమేనని, కాంగ్రెస్‌ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిపై రాహుల్‌ గాంధీ నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు.

Next Story