కాంగ్రెస్ ప్రతి స్కీం వెనుక స్కాం

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రతి స్కీం వెనుక స్కాం
X

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి స్కీం వెనుక స్కాం ఉంటుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ మీడియా హాల్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ ది ప్రజాపాలన కాదని, ప్రజావ్యతిరేక పాలన అన్నారు. రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందన్నారు. రుణమాఫీ మొత్తం చేయకముందే సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేస్తామంటే కుదరదన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో, మేనిఫెస్టోలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు. రైతుల పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని చెప్పి రేషన్ కార్డు ఆధారంగా చేస్తున్నారని, ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేయకుంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతుభరోసా యాసంగి పంటకు ఇవ్వలేదని, ఇప్పుడు వానాకాలం పంటకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చించనప్పుడు రైతుభరోసాపై మాత్రం ఎందుకు చర్చ అని ప్రశ్నించారు. రైతు భరోసా ఎగ్గొట్టడానికే అసెంబ్లీ ముందుకు తీసుకువస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల డేటా సరిగా ఇవ్వకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు తక్కువ మందికి వేస్తుందన్నారు. బీజేపీ ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా పీఎం కిసాన్ నిధులు రైతులకు ఇస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు, విద్యార్థి, నిరుద్యోగ, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమన్నారు.

Next Story