ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు:ప్రధాని

లోక్‌సభ ఎన్నికల తర్వాత మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ పునఃప్రారంభించారు. 'ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌' పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నాం. మా అమ్మ పేరుతో తాను ఒక మొక్క నాటానని ప్రధాని చెప్పారు.

ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచిన ప్రజలకు కృతజ్ఞతలు:ప్రధాని
X

రుతు పవనాల రాకతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా 'ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌' పేరుతో కొత్త ప్రచారం చేపడుతున్నాం. మా అమ్మ పేరుతో నేను కూడా మొక్క నాటాను. ప్రజలందరూ తమ అమ్మతో కలిసి లేదా అమ్మ పేరిట మొక్క నాటాలని ప్రధాని కోరారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోడీ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని పలు ఆసక్తి కర అంశాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత మరోసారి కలుస్తానని మీ అందరికీ చెప్పాను. మన్‌కీ బాత్‌ ద్వారా మరోసారి మీ ముందుకు వచ్చాను. ఈ కార్యక్రమం కొన్ని నెలలు నిలిచినా ఆ స్ఫూర్తి మాత్రం ఆ దేశమంతా ఉన్నదని ప్రధాని తెలిపారు. ఇటీవల ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ,రాజ్యాంగంపై ప్రజలు తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. ఎన్నికల్లో 65 కోట్లమంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.

యోగా దినోత్సవంలో పాల్గొన్న మిత్రులందరికీ ప్రధాని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. యోగాను కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా నిత్యం చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతికి దక్కుతున్న ఆదరణ దేశానికి గర్వకారణం అన్నారు. ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తారని దేశం ఆశిస్తున్నది. 'చీర్‌ 4 భారత్‌ ' హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలంతా క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు.

జూన్‌ 30 చాలా ముఖ్యమైన రోజు అన్న మోడీ గిరిజన సోదరులు, సోదరీ మణులు ఇవాళ హల్ దివస్‌ వేడుకలు నిర్వహిస్తున్నారు. వీర్‌ సిద్ధు, కన్హు ధైర్యానికి ప్రతీకగా ఇవాళ్టి రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విదేశీ పాలకుల దురాఘాతాలకు వ్యతిరేకంగా వీర్‌ సిద్ధు, కన్హు, వేలాది మంది సంతాలులను ఏకం చేసి బ్రిటిష్‌ వారితో పోరాడారని అన్నారు. 1857 భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి రెండేళ్ల ముందే గిరిజనులు ఝార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణాలో విదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారని గుర్తు చేశారు. రాష్ట్రాల్లో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ వీక్షించాలి:కిషన్‌రెడ్డి

గత పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాల ముందు భారత దేశ ఖ్యాతి పెరిగిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బంజారా గార్డెన్‌లో ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోకవర్గ బూత్‌ స్థాయి వర్కర్ల సమావేశంలో కిషన్‌రెడ్డితో పాటు కేంద్రమంత్రి పీయూష్‌ గోయెల్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. చాలారోజుల అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించిన మన్‌కీ బాత్‌ కార్యక్రమాన్ని వీక్షించానని చెప్పారు. పదేళ్లుగా రాజకీయ అంశాలకు అతీతంగా ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రధాని నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ వీక్షించాలని కోరారు. ప్రధాని తన మనసులోని ఆలోచనలను దేశ ప్రజలతో పంచుకుంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ప్రజలు చూడాలని కేంద్ర మంత్రి కోరారు.

Raju

Raju

Writer
    Next Story