కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ
X

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేందుకు సీబీఐకి రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేశారు.

రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయగానే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.తీహార్‌ జైలు ఉన్న కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపరిచారు. కేజ్రీవాల్‌ను కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నది. కోర్టు దీనిపై తీర్పును రిజర్వ్‌ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఇప్పటికే ఈడీ అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈడీ కేసులో ట్రయల్‌కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ సీఎం ఉపసంహరించుకున్నారు. హైకోర్టు పూర్తి ఆదేశాలు.. సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు.

కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్‌ చేయడంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు విడుదల చేస్తుందని భయపడిన మోడీ ప్రభుత్వం.. కేజ్రీవాల్‌ ఏడాది కిందటే దర్యాప్తునకు హాజరైన అంశంలో నీచ ఎత్తుగడలతో సీబీఐకి చెప్పి అరెస్టు చేయించిందని సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ఆరోపించింది. బీజేపీ కక్షపూరిత ఆలోచనలు మార్చుకోలేదని దీనిద్వారా స్పష్టమౌతున్నదని తెలిపింది.

Raju

Raju

Writer
    Next Story