వయనాడ్‌ విషాదం...రెస్క్యూ టీమ్‌ డేరింగ్‌ ఆపరేషన్‌

కొండచరియలు విరిగి పడిన వయనాడ్‌లో సహాయక చర్యలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. భారీయంత్రాలు, అధునాతన పరికరాలతో పొద్దున నుంచే గాలింపు చర్యలు చేపట్టారు.

వయనాడ్‌ విషాదం...రెస్క్యూ టీమ్‌ డేరింగ్‌ ఆపరేషన్‌
X

కొండచరియలు విరిగి పడిన వయనాడ్‌లో సహాయక చర్యలు ఐదవ రోజు కొనసాగుతున్నాయి. భారీయంత్రాలు, అధునాతన పరికరాలతో పొద్దున నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. సహాయ చర్యల్లో నైపుణ్యం ఉన్న ప్రైవేట్‌ కంపెనీలు, వాలంటీర్లు, సైన్యం, పోలీసులు, విపత్తు విభాగాలకు సహకరిస్తున్నారు.

కొండచరియలు విరిగిపడిన ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో బండరాళ్లు, కర్రలు, శిథిలాలను తొలిగిస్తున్నారు. శుక్రవారం నుంచి కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను జోన్లుగా విభజించి.. జీపీఎస్‌ ఉపయోగించి సహాయ చర్యలు ముమ్మరం చేశారు. వైమానిక ఛాయా చిత్రాలు, సెల్‌ఫోన్‌ డేటా ఆధారంగా లొకేషన్‌ మ్యాపింగ్‌ చేశారు. మట్టి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రాడార్‌. డాగ్‌ స్క్వాడ్‌లను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ప్రాణాలతో బైట పడితే తక్షణ వైద్యం అందించడానికి పెద్ద సంఖ్యలో వైద్య నిపుణులు, ఆంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన పూర్తికావడంతో భారీ యంత్రాలు తరలించడానికిమార్గం సుగమం అయ్యింది. వయనాడ్‌, మలప్పురం, కోజికోడ్‌ జిల్లాల గుండా ప్రవహించే చలియార్‌ నదీ తీరం వెంబడి సహాయచర్యలు కొనసాగుతున్నాయి. వయనాడ్‌లో మృతుల సంఖ్య 308కి చేరింది.

ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన రెస్క్యూ టీమ్‌

అలాగే కల్పేట ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కె. హాషిస్‌ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అక్కడ ఇంకా కొండ చరియలు విరిగిపడుతున్నా సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తున్నది. ఈ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకుని ఉండటాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్న గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు.



అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకుని ఉండగా వారిని రక్షించారు. కొన్నిరోజులుగా వాళ్లు ఆహారం తినకపోవడంతో నలుగురు చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు నీరసించిపోయారని రెస్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామని తెలపారు. తమతో రావాల్సిందిగా కోరగా.. ఆ కుటుంబం నిరాకరించింది, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చాలాసేపు బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని చెప్పారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో కొండపై నుంచి సురక్షితంగా కిందికి తీసుకొచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీ-పోచింగ్‌ కార్యాలయానికి తరలించిననట్లు పేర్కొన్నారు.

కేరళ సీఎం పినరయి విజయన్‌ ప్రశంసలు

వయనాడ్‌లో సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరినీ సురక్షిత ప్రాంతాకలు తరలించడంపై దృష్టి సారించామన్నారు. ఇప్పటివరకు 148 మృత దేహాలను అప్పగించామని.. 93 పునరావాస కేంద్రాల్లో 10,042 మంది ఆశ్రయం పొందుతున్నట్టు వెల్లడించారు.67 గుర్తు తెలియని మృతదేహాలున్నాయని మతాంతర ప్రార్థనలు నిర్వహించిన ప్రభుత్వమే వాటిని ఖననం చేస్తుందని తెలిపారు.

మృతదేహాల ఖననంపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు

మృతదేహాల ఖననంపై కేరళ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కొండ చరియలు విరిగిపడిన నేపథ్యంలో పలు చోట్ల గుర్తు తెలియని మృత దేహాలు లభ్యమయ్యాయి. వాటి నుంచి డీఎన్‌ఏ, దంతాలు సేకరించాలని సూచించింది. ఫొటోలు, వీడియోలు రికార్డుల్లో భద్రపరచాలని ఆదేశించింది.

Raju

Raju

Writer
    Next Story