తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలే

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక

తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలే
X

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 9వ తేదీవరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్‌, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్‌, హనుమకొండ జిల్లాలకు భారీ వర్షం పడవచ్చని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

ఆరో రోజు జలదిగ్బంధంలోనే వనదుర్గ మాత ఆలయం

మెదక్‌ జిల్లాలోని వనదుర్గ మాత ఆలయం ఆరో రోజు జలదిగ్బంధంలోనే ఉన్నది. సింగూరు 2 గేట్లు ఎత్తడంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగుతున్నది. వనదుర్గ దేవాలయం ముందు నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో ఆలయంలోకి వరద నీరు చేరింది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంజీరా నదిలోకి జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టువైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత అమ్మవారి దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో తెలిపారు.

మక్తల్‌లోని కేశవనగర్‌లో కూలిన 8 ఇండ్లు

నారాయణపేట జిల్లా మక్తల్‌ లో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాలకు మక్తల్‌లోని కేశవనగర్‌లో 8 ఇండ్లు కూలాయి. గద్వాల జిల్లా మానవపాడు మండలంలో రాత్రి భారీ వర్షం కురిసింది. మానవపాడు-గోకులపాడు మార్గంలో వంతెనపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో గోకులపాడు, అమరవాయి, పెద్ద ఆముదాలపాడు, నారాయణపురం, కలుకుంట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనల సమీపంలోని పంట పొలాలు నీట మునిగాయి.

Raju

Raju

Writer
    Next Story