విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన సర్కారు

గౌలిదొడ్డి గురుకులంలో పాత ఫ్యాకల్టీ కొనసాగింపు

విద్యార్థుల ఆందోళనతో దిగొచ్చిన సర్కారు
X

విద్యార్థుల ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. గౌలిదొడ్డి గురుకులంలో సీనియర్‌ ఫ్యాకల్టీని తొలగించి కొత్త ఫ్యాకల్టీని ప్రభుత్వం నియమించింది. కొత్త ఫ్యాకల్టీకి సబ్జెక్ట్ పై అవగాహన లేదని, వాళ్లను కొనసాగిస్తే తాము జేఈఈ, నీట్‌ సహా జాతీయ పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధించలేమని కొన్ని రోజులుగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనకు బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం సంఘీభావం తెలిపారు. గౌలిదొడ్డి గురుకులం విద్యార్థుల భవిష్యత్‌ తో ఆడుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో గురుకుల సెక్రటరీ గౌలిదొడ్డి ప్రిన్సిపల్‌ కు ఫోన్‌ చేశారు.. తొలగించిన ఫ్యాకల్టీని తిరిగి నియమిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం మాజీ మంత్రులు జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకుల బృందం గౌలిదొడ్డి గురుకులం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొత్త ఫ్యాకల్టీ నియామకంతో తమ భవిష్యత్‌ ప్రమాదంలో పడిందన్నారు. తాము ఏమైనా డౌట్స్‌ అడిగితే గూగుల్‌ లో సెర్చ్‌ చేసుకోండని చెప్తున్నారని, వాళ్లను వెంటనే తొలగించి పాత ఫ్యాకల్టీని మళ్లీ నియమించాలని కోరారు. గౌలిదొడ్డి గురుకులంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఏ రోజు అనుకోలేదని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. విద్యార్థులు ఆందోళన చెందొద్దని.. తాము అండగా ఉంటామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం గురుకులాలను అద్భుతంగా నడిపించిందని, ఈ రోజు ఇలాంటి సమస్యలు వస్తాయని ఊహించలేదని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. విద్యార్థులు అధైర్య పడవద్దని, బీఆర్‌ఎస్‌ మీ వెంట ఉంటదని భరోసా ఇచ్చారు. దేశం తెలంగాణ వైపు చూసేలా కేసీఆర్‌ గురులాలను నడిపించారని, కొత్త ప్రభుత్వం వాటిని అంధకారంలోకి నెట్టేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్‌, క్రాంతి, బీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు తుంగు బాలు తదితరులు ఉన్నారు.

Next Story