మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూర్యకుమార్‌ క్యాచ్‌

చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్‌ మిల్లర్‌ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ లైన్‌ వద్ద సూర్యకుమార్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. చిరస్మరణీయమైన ఆ క్యాచ్‌ టీమిండియా విజయంలో కీలకమైంది.

మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూర్యకుమార్‌ క్యాచ్‌
X

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సఫారీ జట్టుపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. బాల్‌ బాల్‌కు నరాలు తెగేలా ఉత్కంఠ పరిస్థితుల మధ్య సూర్యకుమార్‌ యాదవ్‌ బౌండరీ లైన్‌ వద్ద పట్టిన క్యాచ్‌ మొత్తం మ్యాచ్‌నే మలుపు తిప్పింది. సూర్యకుమార్‌ చరిత్రలో నిలిచిపోయే పట్టిన క్యాచ్‌ భారత్‌ విజయానికి బాటలు వేసింది అంటే అతిశయోక్తి కాదు.

చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరం. హార్దిక్‌ పాండ్య వేసిన మొదటి బంతిని మిల్లర్‌ గాల్లోకి లేపాడు. కామెంటరీ బాక్స్‌లో ఉన్నవాళ్లు.. స్టేడియంలో ఉన్న వాళ్లంతా అది సిక్సరేమో అనుకున్నారు. కానీ వైడ్‌ లాంగాఫ్‌ నుంచి మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చిన సూర్యకుమార్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. ఆ క్యాచ్‌ పట్టడానికి ప్రయత్నం చేయకపోతే సిక్సర్‌ వెళ్లేది. విఫలమైతే ఫోర్‌ లేదా రెండు రన్స్‌ అయినా వచ్చేవి. కానీ మిల్లర్‌ క్రీజ్‌లో ఉంటే ఏమైనా జరిగే అవకాశాలు ఉండేవి. సఫారీ జట్టుకు సూర్యకుమార్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. అద్భుతమైన క్యాచ్‌ పట్టి నియంత్రణ కోల్పోవడంతో బౌండరీ లైన్‌ దాటేలోగానే గాల్లోకి విసిరాడు. తిరిగి వచ్చి బంతిని పట్టుకుని జట్టు సభ్యులందరినీ ఆనందంలో ముంచెత్తాడు

2001లో వచ్చిన అమీర్‌ ఖాన్‌ లగాన్‌ మూవీ క్లైమాక్స్‌ సీన్‌ను తలపించింది. భువన్‌ (అమీర్‌ఖాన్‌) బలంగా కొట్టిన బంతి గాల్లోకి వెళ్తుంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ రస్సెల్‌ క్యాచ్‌ పడుతాడు. మేము గెలిచామని కేకలు వేస్తాడు. కానీ అందరూ మౌనంగా ఉంటారు. కారణం క్యాచ్‌ పట్టిన రస్సెల్‌ బౌండరీ లైన్‌ దాటి ఉంటాడు. దీంతో ఇండియా గెలుస్తుంది. నిన్న టీ 20 ప్రపంచకప్‌లోనూ ఇదే సీన్ కనిపించింది. కానీ సూర్యకుమార్‌ సిక్సర్‌ వెళ్లాల్సిన బాల్‌ను పరుగెత్తుకుంటూ వచ్చి పట్టుకుని, గాల్లోకి విసిరి, బౌండరీ లైన్‌ దాటి, తిరిగి లోపలికి వచ్చి పట్టిన ఆ అద్భుత సీన్‌ నాటి సినిమా క్లైమాక్స్‌ను తలపించింది.

అలా సూర్యకుమార్‌ పట్టిన ఈ క్యాచ్‌ 2007 టీ 20 ప్రపంచకప్‌లో శ్రీకాంత్‌ పట్టిన క్యాచ్‌ను, 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో ధోనీ కొట్టిన సిక్సర్‌ను తలపించింది. చిరస్మరణీయమైన క్యాచ్‌ పట్టిన సూర్యకుమార్‌ టీమిండియా విజయంలో కీలకమయ్యాడు.

Raju

Raju

Writer
    Next Story