బంగ్లాదేశ్‌లో విద్యార్థులకు అనుకూలంగా సుప్రీం తీర్పు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

బంగ్లాదేశ్‌లో విద్యార్థులకు అనుకూలంగా సుప్రీం తీర్పు
X

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.1971 బంగ్లా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవారి కుటుంబసభ్యులకు ఇస్తున్న 30 శాతం కోటాను 5 శాతానికి తగ్గించింది. మరో రెండు శాతం మైనారిటీలు, ట్రాన్స్‌ జెండర్‌లు, దివ్యాంగులకు కేటాయించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 93 శాతం ఉద్యోగాలు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విద్యార్థులు ఆందోళన విరమించి తరగతి గదులకు వెళ్లాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుతో వారం రోజులుగా అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో శాంతియుత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నది.

అంతకుముందు విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో బంగ్లా ప్రభుత్వం దేశమంతా కర్ఫ్యూను పొడిగించింది. వారం రోజులకు జరుగుతున్న హింసాత్మక ఘటనలో 150 మందికి పైగా చనిపోగా.. వందలాదిమంది గాయపడ్డారు. మృతుల సంఖ్యతో పాటు గాయపడిన వారి వివరాలను బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.

వారం రోజుల కిందట ఆ దేశ రాజధాని ఢాకా విశ్వవిద్యాలయం కేంద్రంగా మొదలైన ఆందోళనలు దేశమంతా విస్తరించాయి. నిరసనలో భాగంగా రోడ్లపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు వారిపైకి రాళ్లు విసరడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, రబ్బర్‌ బుల్లెట్లు, పొగ గ్రనేడ్‌లను వినియోగించారు. శనివారం కూడా ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Raju

Raju

Writer
    Next Story