ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలి: సీఎం రేవంత్ రెడ్డి
X

ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగాన్ని నేషనల్‌ హైవేగా ప్రకటించాలని, హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో రేవంత్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, ఇప్పటికే ప్రకటించిన మార్గాల పనుల ప్రారంభం తదితర అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు.

సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ (158.645 కి.మీ) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూసేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని కేంద్రమంత్రికి రేవంత్‌ వివరించారు.ఈ భూభాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామని తెలిపారు. చౌటుప్పల్‌ నుంచి అమన్‌గల్‌-షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు (181.87 కి.మీ) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్రమంత్రిని సీఎం కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్‌హచ్‌ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌ (ఓఆర్‌ఆర్‌ గౌరెల్లి జంక్షన్‌) నుంచి వలిగొండ-తొర్రూర్‌-నెల్లికుదురు-మహబూబాబాద్‌-ఇల్లెందు-కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్‌-930 పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, దీనిలో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.లకు మాత్రమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ ప్రజలు భద్రాచలం వెళ్లడానికి 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్‌ రోడ్‌గా వరంగల్‌ సభలో నితిన్‌ గడ్కర్‌ చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్‌అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ ఉన్నారు.

Raju

Raju

Writer
    Next Story