రహస్య ప్రదేశంలో షేక్‌ హసీనా

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని మరికొన్ని రోజులు భారత్‌లోనే ఉండాలనుకుంటున్నట్లు సమాచారం.

రహస్య ప్రదేశంలో షేక్‌ హసీనా
X

రిజర్వేషన్ల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చిన షేక్‌ హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటారని సమాచారం. ఇండియాకు వచ్చిన ఆమె ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఢిల్లీలోని తన కుమార్తెను కలిసిన అనంతరం లండన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కలిశారు.

రిజర్వేషన్ల ఆందోళనలతో బంగ్లాదేశ్‌ అట్టుడుకున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేయడంతో పాటు వెంటనే ఆమె దేశం విడిచి వెళ్లడం వేగంగా జరిగాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న షేక్‌ హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్‌ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాజీనామా చేయాలంటూ..అక్కడి సైన్యం 45 నిమిషాల సమయం ఇచ్చింది. దీంతో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాక.. రాజీనామా చేయాలనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్‌ కు చేరుకున్నారు. ఘజియాబాద్‌ లోని ఇండన్‌ విమానాశ్రయానికి సీ 130 సైనిక విమానంలో చేరుకున్నారు. ఆమె లండన్‌ వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే హసీనా ఇప్పటికిప్పుడు లండన్‌ వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రహస్య ప్రదేశంలో ఉన్నారు. హసీనా వెంట ఆమె సోదరి రిహానా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజెద్‌ను కలుసుకునే అవకాశం ఉన్నది. రహస్య ప్రదేశంలో ఉన్న ఆమెను అజిత్‌ దోవల్‌ కలిసి బంగ్లాదేశ్‌ విషయంలో భారత్‌ వైఖరిని తెలియజేశారు.

పరిస్థితిని సమీక్షించిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ

అటు ప్రధాని నరేంద్రమోడీతో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ భేటీ అయి హసీనా గురించి చెప్పారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు విపక్ష నేత రాహుల్‌గాంధీ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

నిశితంగా పరిశీలిస్తున్న ఐరాస, అమెరికా

మరోవైపు బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి, అగ్రరాజ్యం అమెరికా తెలిపాయి. బంగ్లాలో పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌ ప్రజలు ప్రశాంతంగా, సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. అమెరికా కూడా అక్కడ పరిస్థితులను గమనిస్తున్నట్లు ఆ దేశ జాతీయ భద్రతా మండలి తెలిపింది. బంగ్లాలో నెలకొన్న మధ్యంతర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరింది. అక్కడ ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని పిలుపునిచ్చింది.

హసీనా తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు: హసీనా తనయుడు

భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఆమె కుమారుడు సాజీబ్‌ వాజెద్‌ జాయ్ తెలిపారు. ముందు రోజు నుంచి ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు. పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకున్నారని సాజీబ్‌ పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయని తెలిపారు. తన తల్లి తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదన్నారు.

Raju

Raju

Writer
    Next Story